అసభ్యకర, అభ్యంతరకర ఏఐ, డీప్‌ఫేక్ కంటెంట్ విషయంలో సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై అలాంటి కంటెంట్‌ను మూడు గంటల్లోగా తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరకరం అని గుర్తించి, ఫిర్యాదు చేసిన కంటెంట్‌ను మూడు గంటల్లోగా తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకునేలా తాజాగా చట్టంలో మార్పులు చేసింది.
గతంలో ఈ గడువు 36 గంటలు ఉండేది. ఇప్పుడు మాత్రం మూడు గంటలకే పరిమితం చేసింది. ఐటీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021కు తాజాగా మార్పులు చేస్తూ కేంద్రం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్ అన్నింటిపై వచ్చే అభ్యంతరకర ఏఐ జనరేటెడ్, డీప్‌ఫేక్, అల్టర్డ్ వీడియోలు, ఇమేజెస్, ఆడియోలను మూడు గంటల్లో తొలగించాలి.
అది ఆడియో అయినా, లేదా విజువల్ అయినా లేదా ఆడియో-విజువల్ అయినా చర్యలు తీసుకోవాలి. ఈ కంటెంట్‌కు సంబంధించి ప్రజల్లో విశ్వాసం పెంచే, ఎడ్యుకేషనల్, క్రియేటివ్, డిజైన్ వర్క్‌తో కూడిన ఎడిటెడ్, ఇంప్రూవైజ్డ్ కంటెంట్‌కు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఒక కంటెంట్ ఏదైనా ఏఐ జనరేటెడ్ లేదా ఫేక్ అయితే దానిపై ఆ విషయాన్ని ఎస్ఎంలు వెల్లడించాలి. అంటే కంటెంట్‌పై ఏఐ అని వచ్చేలా చూడాలి.
అలాగే ఏదైనా కంటెంట్ వినియోగదారులు అప్లోడ్ చేసేముందు దానిపై డిక్లరేషన్ కూడా ఇవ్వాలి. దీనివల్ల ఏ యూజర్ అయినా తప్పుడు ప్రచారం చేసే వీలుండదు. ఇదంతా అమలు చేసేందుకు ఎస్ఎం సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌పై సాంకేతికపరమైన మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేక టూల్స్ రూపొందించుకోవాలి.
ఇక కేంద్ర నిర్ణయం ఈ నెల 20 నుంచి అమలులోకి వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అభ్యంతరకర, తప్పు దోవ పట్టించే కంటెంట్ పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియకుండా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిబంధనల్ని కఠినతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా ఈ చట్టం రక్షిస్తుంది.

More Stories
రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు
భారీగా పెరుగుతున్న విమానాశ్రయాల యూజర్ చార్జీలు
డిజిటల్ మోసాల కేసులను ఎదుర్కోవడానికి ఎస్ఓపి