భారత్ తో క్రికెట్ బహిష్కరణపై పాక్ వెనకడుగు

భారత్ తో క్రికెట్ బహిష్కరణపై పాక్ వెనకడుగు

టీ20 ప్రపంచకప్​లో భారత్​తో మ్యాచ్​ ఆడబోమంటూ ప్రకటించిన పాకిస్థాన్​ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. టీమ్ఇండియాతో మ్యాచ్ బహిష్కరించాలన్న తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ నుంచి సోమవారం అర్ధరాత్రి ప్రకటన వచ్చింది. పీసీబీతో ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ చర్చల అనంతరం ఈ ప్రకటన వచ్చింది. ఈ చర్చలతో సంతృప్తి చెందడమే కాకుండా మిత్ర దేశాలు భారత్​తో మ్యాచ్ ఆడాలని విజ్ఞప్తి చేయడంతో పాక్ ప్రభుత్వం పీసీబీకి అనుమతి ఇచ్చింది.

“భారత్​తో మ్యాచ్ విషయంలో చర్చలపై సంతృప్తిగా ఉన్నాం. అలాగే మిత్ర దేశాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని టీమ్ఇండియాతో మ్యాచ్​ బాయ్​కాట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. టీ20 ప్రపంచ కప్‌లో షెడ్యూల్ ప్రకారం భారత్​తో మ్యాచ్ ఆడాల్సిందిగా మా (పాకిస్థాన్) క్రికెట్ బోర్డును అదేశిస్తున్నాం. దీంతో ఫిబ్రవరి 15న భారత్​తో మ్యాచ్​ కోసం మా జట్టు మైదానంలోకి దిగుతుంది” అని పాక్​ ప్రభుత్వం పత్రికా ప్రకటనలో పేర్కొంది.

అంతకుముందు, ప్రపంచకప్​లో భారత్​తో మ్యాచ్ బాయ్​కాట్​ నిర్ణయంపై పునరాలోచించాలని ఇటీవల పీసీబీకి శ్రీలంక బోర్డు లేఖ రాసింది. అంతేకాకుండా శ్రీలంక ప్రధాని అనుర కుమార దిసనాయకే సైతం పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్​కు ఫోన్​ చేసి మాట్లాడారు. దీనిపై ​ప్రకటన వచ్చిన తర్వాత దిసనాయకే పాక్ ప్రధానికి ఎక్స్ వేదికగా ధన్యవాదాలు చెబుతూ పోస్టు షేర్ చేశారు. అనేక మంది ప్రమించే ఈ మ్యాచ్ జరిగేలా చూసినందుకు షరీఫ్​కు ధన్యవాదాలు తెలిపారు.

అయితే ఈ టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్​కు మద్దతుగా భారత్​తో ఆడాల్సిన మ్యాచ్​ను బహిష్కరిస్తున్నట్లు ఇటీవల పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దాయాదుల పోరుపై సస్పెన్స్ నెలకొంది. ఐసీసీ రంగంలోకి దిగి పలు దఫాలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్​ క్రికెట్ బోర్డులతో చర్చలు జరపడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. దీంతో షెడ్యూల్ ప్రకారం ఈనెల 15న కొలంబో వేదికగా భారత్ x పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.

 కాగా, ఈ చర్చల్లో పాకిస్థాన్ ప్రతిపాదించిన పలు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్​ ఈ ప్రపంచ​కప్​ నుంచి తప్పుకున్నందున భారత్, బంగ్లా, పాకిస్థాన్​ జట్ల మధ్య ట్రై సిరీస్​ నిర్వహించాలని, అలాగే భారత్- పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు పునఃప్రారంభం చేయాలని డిమాండ్ చేసింది. అయితే ట్రై సిరీస్​కు ఐసీసీ నో చెప్పింది. ఇక భారత్- పాక్​ ద్వైపాక్షిక సిరీస్​ అంశం తమ చేతుల్లో లేదని వివరించింది. అయితే, వచ్చే అండర్‌- 19 వరల్డ్​కప్ ఆతిథ్య హక్కులను మాత్రం బంగ్లాదేశ్​కు ఇచ్చే అవకాశాన్ని ఐసీసీ పరిశీలించనుందని తెలిసింది.