మాజీ ఆర్మీ చీఫ్‌ పుస్తకంపై విస్తృత ప్రచారం.. కేసు నమోదు

మాజీ ఆర్మీ చీఫ్‌ పుస్తకంపై విస్తృత ప్రచారం.. కేసు నమోదు
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ప్రచురణ కాని పుస్తకం ప్రచారంలోకి రావడంపై ఢిల్లీ పోలీసులు దృష్టిసారించారు. రాజకీయ వివాదాన్ని రాజేసిన ఈ పుస్తకం ప్రచారంపై కేసు నమోదు చేశారు. ఆర్మీ జనరల్ ఎంఎం నరవణేకు సంబంధించిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఇంకా ప్రచురణ కాలేదు.  ఈ పుస్తకం ప్రచురణకు సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతి ఇంకా లభించలేదు. 
కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఈ పుస్తకం నకలును ప్రదర్శించారు. 2020 నాటి భారత్-చైనా సంఘర్షణకు సంబంధించి మాజీ ఆర్మీ చీఫ్‌ చేసిన ఆరోపణలను లోక్‌సభలో ప్రస్తావించారు.  స్పీకర్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో ఎనిమిది మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు. అలాగే లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగాన్ని ప్రధాని మోదీ రద్దు చేసుకున్నారు.

మరోవైపు ఈ పుస్తకం ముద్రణ కాపీ, పీడీఎఫ్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నట్లు సోషల్‌ మీడియాలో, వార్తల్లో ప్రచారం జరుగుతున్నది. అదే శీర్షికతో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ముద్రించినట్లుగా ఉన్న పుస్తకం పీడీఎఫ్ కాపీ కొన్ని వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నది.  కొన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా పూర్తి ముద్రణ పుస్తకం కొనుగోలుకు అందుబాటులో ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ముద్రణకు ఇంకా అనుమతి లభించని ఈ పుస్తకం ప్రచురణ, అందులోని అంశాల లీక్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ సెల్‌ ఏర్పాటు చేశారు. మరోవంక, పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా (పిఆర్ హెచ్ఐ) మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే జ్ఞాపకాల పుస్తకం, ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ ఏకైక ప్రచురణకర్త తామే అని పేర్కొంది. ఈ పుస్తకం ఇంకా విడుదలకాలేదని ధృవీకరించింది.

ఒక అధికారిక ప్రకటనలో, ఈ జ్ఞాపకాల ప్రత్యేక ప్రచురణ హక్కులను తామే కలిగి ఉన్నట్లు తెలిపింది.ప్రింటెడ్ లేదా డిజిటల్ అయినా, ఇప్పటివరకు పుస్తకం ఏ వెర్షన్ విడుదల కాలేదని, లేదా ప్రజలకు పంపిణీ చేయలేదని స్పష్టం చేసింది. 

“భారత సైన్యానికి మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఏకైక ప్రచురణ హక్కులను మేము కలిగి ఉన్నామని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పష్టం చేయాలనుకుంటోంది. పుస్తకం ప్రచురణలోకి రాలేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము” అని ఆ ప్రకటనలో తెలిపారు. “ప్రస్తుతం చెలామణిలో ఉన్న పుస్తకం ఏదైనా కాపీలు, పూర్తిగా లేదా పాక్షికంగా, ప్రింట్, డిజిటల్, పిడిఎఫ్ లేదా ఏదైనా ఇతర ఫార్మాట్, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో, ఏదైనా ప్లాట్‌ఫామ్‌లో,  పెంగ్విన్ కాపీరైట్ ఉల్లంఘనకు లోనవుతాయి. వెంటనే నిలిపివేయాలి” అని హెచ్చరించింది.