టీఆర్ఎస్ గల్లీ పార్టీ, గడీల పార్టీ  

టీఆర్ఎస్ గల్లీ పార్టీ, గడీల పార్టీ  

టీఆర్ఎస్ గల్లీ పార్టీ, గడీల పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ కుమార్ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫతేనగర్‌‌లో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో బండి సంజయ్ పాల్గొంటూ  ఫతే‌నగర్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా నిలుచున్న కృష్ణ గౌడ్‌ను గెలిపించాలని కోరారు. 

బీజేపీని ఢిల్లీ పార్టీ అని టీఆర్ఎస్ నేతలు అనడంపై సంజయ్ మండిపడుతూ  గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీదే హవా అని స్పష్టం చేశారు. దేశంలో 15కు పైగా రాష్ట్రాల్లో బీజేపీ పవర్‌లో ఉందని గుర్తు చేశారు. 

‘తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రతి రూపాయి కేంద్రం ఇచ్చిందే. రోడ్లు, లైట్లు, మోరీలు, చెట్లు, నీళ్లు, బియ్యం, కమ్యూనిటీ హాళ్లతో పాటు ఆఖరికి శ్మశాన వాటికల పైసలు కూడా కేంద్రం ఇచ్చిందే. మోడీ సర్కార్ ఇచ్చిన డబ్బులను సీఎం కేసీఆర్ ఫొటోలు, పేర్లు మార్చి, యాసతో, భాషతో అడ్డదారులతో తనవిగా చెప్పుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. 

టీఆర్ఎస్ నేతల గడీలను బద్దలుకొట్టే పార్టీ బీజేపీయే అని పేర్కొంటూ దుబ్బాకలో ప్రజలు ఇచ్చిన తీర్పును హైదరాబాద్ జనాలు రిపీట్ చేయాలని పిలుపిచ్చారు. ఈ రాష్ట్రానికి బీజేపీ సర్కార్ రెండు లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. రూ.3,500 కోట్లు ఇచ్చింది. భాగ్యనగరానికి 1.40 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చిందని చెప్పారు. కానీ కేసీఆర్ కట్టించలేదని దుయ్యబట్టారు. 

కాగా, గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరుస రోడ్ షోలు చేస్తున్నారు. పగలంతా ప్రచారంలో బిజీగా ఉన్న ఆయన  గత రాత్రి బస్తీ నిద్రలో భాగంగా నాగోల్‌లోని శివాలయం ప్రాంతంలో ఆరుబయట నిద్రించారు. జయపూర్ కాలనీలో బస్తీ వాసులతో కలిసి రాత్రి పూట భోజనం చేశారు.