శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన భక్తులు సులభంగా లడ్డూలు పొందేలా టీటీడీ ఆలోచనలు చేస్తోంది. లడ్డూ విక్రయ కేంద్రంలోని ప్రతి కౌంటర్ వద్ద యూపీఐ పేమెంట్‌కు అవకాశం కల్పించనుంది. ఏటా లడ్డూల విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. కౌంటర్ వద్ద భక్తులు నగదు చెల్లించి లడ్డూలు పొందుతున్నారు.
శ్రీవారి ఆల యం వెనుకభాగంలోని లడ్డూ విక్రయ కేంద్రంలో గతేడాది కియోస్క్ యంత్రాలను టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల యూపీఐ చెల్లింపులు చేసే వారి సంఖ్య పెరిగిన క్రమంలో ఈ నూతన యంత్రాలను అందుబాటులో ఉంచింది. కావాల్సిన లడ్డూల సంఖ్య ఎంపిక చేసి యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తే వచ్చే రశీదు ఆధారంగా కౌంటర్లో లడ్డూలు పొందవచ్చు.
అయితే, ఈ యంత్రాల వద్ద ఇటీవల రద్దీ అధికం కావడం, యంత్రాల్లో సాంకేతిక ఇబ్బందులు, మళ్లీ లడ్డూల కోసం కౌంటర్ క్యూలైన్లలో నిలబడడం తదితర కారణాల నేపథ్యంలో కౌంటర్ల వద్దే పేమెంట్ క్యూఆర్ కోడ్ బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తద్వారా అదనంగా కియోస్క్ యంత్రాల ముందు నిలబడే అవసరం ఉండదని, నేరుగా కౌంటర్లోనే లడ్డూలు పొందవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ సర్వీసును ఇచ్చేందుకు ఓ బ్యాంక్ కూడా ముందుకు వచ్చినట్టు సమాచారం. తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని కౌంటర్లలో ఈ విధానాన్ని అమలుచేసి వచ్చే ఫలితాలను బట్టి అన్ని కౌంటర్ల వద్ద ఏర్పాటు చేయాలని టీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారు.

More Stories
కల్తీ లడ్డు వాస్తవాలను వెల్లడించనున్న కూటమి నేతలు
ప్రతి భక్తుడికీ మహా శివరాత్రి పర్వదినం రోజున ఒక ఉచిత లడ్డు
శ్రీ కళ్యాణవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు