హైదరాబాద్ నాంపల్లిలోని స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ల్యాబ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న కంప్యూటర్ ల్యాబ్‌లో తొలుత మంటలు చెలరేగి నిమిషాల వ్యవధిలోనే ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన కార్యాలయ ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అగ్నిప్రమాదం వల్ల ఆ ప్రాంతమంతా దట్టంగా నల్లటి పొగ అలుముకుంది. ఈ ప్రమాదంలో ఎఫ్ఎస్ఎల్ లోపల ఉన్న కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోయినట్లు సమాచారం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ల్యాబ్‌లో కీలకమైన కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు దెబ్బతిన్నాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మొదటి అంతస్థులోని కంప్యూటర్లు, ఫిజికల్ ఎవిడెన్స్ సహా ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైనట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కీలక కేసులకు సంబంధించి ఆధారాలు కాలి బూడిదైనట్టు సమాచారం.
ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్ని ప్రమాదంతో ఏయే వస్తువులు దగ్ధమయ్యాయన్నది ఇంకా నిర్ధారణ కాలేదని ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే ఎఫ్‌ఎస్‌ఎల్‌ను హైదరాబాద్ నార్త్ జోన్ డిఐజి శ్వేత, ఖైరతాబాద్ జోన్ డిసిపి శిల్పవల్లి పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. నేర పరిశోధనకు సంబంధించిన ఫైళ్లు, ఆధారాలు భద్రపరిచే ఎవిడెన్స్ లాబరేటరీ కార్యకలాపాలు ఈ భవనం నుంచే నిర్వహిస్తారని ఆమె తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక రాజకీయ ప్రకంపనలు సృష్టించిన అనేక కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు ఆ ల్యాబ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫైళ్లు అన్నీ అగ్నికి ఆహుతైనట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లు, డిజిటల్ డేటా విశ్లేషణ ఇక్కడే జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వీటితోపాటు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌ల ఒరిజినల్ ఫైల్స్ ఇక్కడి కంప్యూటర్లలోనే నిక్షిప్తమై ఉన్నట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, వాటికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులు సైతం ఇక్కడే ఉన్నట్టు తెలుస్తోంది.

More Stories
మైనారిటీ గురుకులాల్లో మతమార్పిడిలను ప్రోత్సహించే అడ్మిషన్లు
గడ్చిరోలిలో ఏడుగురు మావోయిస్టులు మృతి
బిజెపి గెలిస్తే మునిసిపాలిటీల్లో ఎలాంటి పన్నుల పెంపు ఉండదు