మాతృత్వం అనేది పూర్తిగా మహిళల ప్రాథమిక హక్కు అని, గర్భం దాల్చి ఒక బిడ్డకు జన్మనివ్వాలా? వద్దా అనేది ఆమె స్వేచ్ఛకు వదిలివేయాలని సుప్రీంకోర్టు మరోమారు స్పష్టం చేసింది. గర్భం అనేది పూర్తిగా మహిళ ఇష్టానుసారమే ఉండాలని, ఆమె ఇష్టం లేకుండా గర్భం కొనసాగించాలని ఏ న్యాయస్థానం కూడా ఒత్తిడి చేయలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు పేర్కొంది.
మైనర్‌గా ఉన్నప్పుడు గర్భవతి అయిన ఒక అమ్మాయి 30 వారాల గర్భాన్ని వైద్యపరంగా తొలగించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ముంబయిలోని జెజె ఆసుపత్రిలో గర్భవిచ్చిత్తి ప్రక్రియకు ఆదేశాలు జారీ చేసింది. గర్భవిచ్ఛిత్తికి నిరాకరిస్తూ బాంబే హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. గర్భిణీ నిర్ణయానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, ముఖ్యంగా గర్భధారణ కొనసాగింపుపై అయిష్టత వ్యక్తం చేసిన పరిస్థితుల్లో ఆమె స్వేచ్ఛకు వదలివేయాలని స్పష్టం చేసింది.
గర్భవిచ్ఛిత్తి కోసం మహారాష్ట్రకు చెందిన ఒక అమ్మాయి తొలుత బాంబే హైకోర్టును ఆశ్రయించగా తొలగింపు నిబంధనల ప్రకారం గడువు మించిపోవడంతో కోర్టు అందుకు నిరాకరించింది. అనంతరం ఈ అంశం సుప్రీం కోర్టుకు చేరింది. అమ్మాయి వైద్య నివేదికలు పరిశీలించిన సుప్రీంకోర్టు ధర్మాసనం గర్భస్రావానికి అనుమతించినా అమ్మాయికి ఎటువంటి ప్రమాదం ఉండదని వైద్యులు చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని గర్భవిచ్ఛిత్తికి అనుమతిచ్చింది.
విచారణ సందర్భంగా ఈ కేసులో నైతిక, చట్టపరమైన సంక్లిష్టమైన సమస్యలున్నాయని జస్టిస్ నాగరత్న అంగీకరించారు. ఒక బిడ్డకు జన్మనివ్వడం ద్వారా కొత్త ప్రాణి జీవపోసుకోవడం వాస్తవమే అయినా ప్రస్తుత కేసులో మైనర్ బాలికకు గర్భదారణకు సంబంధించి అవగాహన లేదని, పైగా గర్భం కొనసాగించడం ఆమెకు ఇష్టం లేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని జస్టిస్ నాగరత్న అభిప్రాయపడ్డారు.
“ఏం చేయాలో నిర్ణయించడానికి మాకు కూడా కష్టంగానే ఉంది. కొత్త ప్రాణం జీవం పోసుకుంటుంది కనుక గర్భాన్ని కొనసాగించి బిడ్డకు జన్మనివ్వాల్సిందేనని ఆమెను ఆదేశించాలా? అప్పుడు ఇంకో ప్రశ్న ఉత్పన్నమవుతుంది. చట్టం ప్రకారం 24 వారాల అప్పుడే గర్భవిచ్ఛిత్తి చేసుకునేవీలున్నప్పుడు అదే పని 30 వారాల సమయంలో ఎందుకు చేయకూడదు?” అంటూ ఆమె సందేహం వ్యక్తం చేశారు.
“ఏది ఏమైనా, ఆమె తన గర్భాన్ని కొనసాగించడానికి ఇష్టంగా లేదన్నది వాస్తవం. ఆమె బిడ్డకు జన్మనివ్వాలని కోరుకోవడం లేదు. ఇదే ఇక్కడ సంక్లిష్టమైన అంశం. మైనర్ బాలిక కానీ, లేదా మహిళను కానీ ఆమెకు ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలని ఏ కోర్టు ఒత్తిడి చేయలేదు” అని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. శారీరక స్వయం ప్రతిపత్తి, మాతృత్వం అనేవి మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో పునరుద్ఘాటిస్తూ వస్తుంది. 2024లో ఒక కేసు విచారణ సందర్భంగా మాతృత్వపు ఎంపిక అంటే బిడ్డకు జన్మనివ్వాలా? వద్దా అనేది రాజ్యాంగంలోని అధికరణ 21 కింద మహిళల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

More Stories
ముంబైలో తొలి బిజెపి మేయర్ గా రితు తవాడే
భారత్ – అమెరికా వాణిజ్య ఒప్పందం ముసాయిదా విడుదల
యూనస్ ఇంటి ముందు హింసాయుత ప్రదర్శనలు