కలలు కనకపోవడం నేరం అని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు చెప్పారు. పెద్ద కలలు కనాలి. ఆ కలల సాకారం చేసుకోవడానికి కార్యాచరణ ఉండాలని ఆయన విద్యార్థులకు సూచించారు. సిబిఎస్‌ఇ, ఐఎస్‌సిఇ, ఇతర బోర్డ్ ఎగ్జామ్స్ సమీపిస్తున్న తరుణంలో ‘పరీక్షా పే చర్చ’ 9వ ఎడిషన్ సందర్భంగా మోదీ శుక్రవారం ఎగ్జామ్ వారియర్స్‌తో సంభాషించారు. ఆయనతో వివిధ రాష్ట్రాల విద్యార్థులు ముచ్చటించారు.
గుజరాత్‌లోని దేవ్‌మోగ్రా, కోయంబత్తూరు, రారుపూర్, గౌహతిల నుంచి వచ్చిన విద్యార్థులతో ఆయన సంభాషణలు జరిగాయి. “కచ్చితంగా కలలు కనాలి. కానీ కలల్ని అనుకుంటే సరిపోదు. దానికితగ్గట్టుగా కార్యాచరణ ఉండాలి. జీవితంలో ప్రతిదానిలో సమతుల్యత ఉండాలి. మీరు ఒకవైపే వంగి ఉంటే కచ్చితంగా పడిపోతారు” అని ప్రధాని చెప్పారు. “నైపుణ్యాలు రెండు రకాలు. జీవిత నైపుణ్యాలు, వృత్తి నైపుణ్యాలు. ఎవరైనా దేనిపై దృష్టి పెట్టాలని నన్ను అడిగతే.. రెండింటిపై దృష్టి పెట్టమని చెబుతాను. ఇవి రెండు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి” అని తెలిపారు.
“అధ్యయనం చేయకుండా, గమనించకుండా, జ్ఞానాన్ని అన్వయించకుండా ఏదైనా నైపుణ్యాన్ని సంపాదించచ్చా? నైపుణ్యం ప్రారంభం జ్ఞానంతోనే.. దాని ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయలేము” అని ప్రధాని విద్యార్థులకు సలహానిచ్చారు. విద్యను భారంగా భావించకూడదని చెబుతూ ఇందులో చొరవ, ప్రమేయం ఉండాలని చెప్పారు. చిన్న చిన్న చదువులు విజయాన్ని అందివ్వవని పేర్కొంటూ జీవితం కేవలం పరీక్షల గురించి కాదని, విద్య మన అభివృద్ధికి ఒక మాధ్యమం మాత్రమే అని స్పష్టం చేశారు.
మార్కులపై మాత్రమే దృష్టి పెట్టకుండా ప్రతి ఒక్కరూ తరగతి గదులు, పరీక్షలకు మించి జీవితంలో మెరుగుదలపై దృష్టి పెట్టాలని ప్రధాని హితవు చెప్పారు. కొన్నిసార్లు ఉపాధ్యాయులు పరీక్షలకు ముఖ్యమైన వాటిని మాత్రమే బోధిస్తారని, కానీ మంచి ఉపాధ్యాయుడు ప్రతిదీ బోధిస్తాడని, మొత్తం మెరుగుదలపై దృష్టి పెడతాడని ప్రధాని వివరించారు.
తమకు అనువుగా అనిపించే పరీక్షల ప్రిపరేషన్ పద్ధతిపై నమ్మకం ఉంచాలని విద్యార్థులకు ప్రధాని పిలుపునిచ్చారు. పరీక్షల ప్రిపరేషన్ పద్ధతిపై ఎవరైనా సలహాలను ఇచ్చినా స్వీకరించి, వాటిలో నుంచి తమకు వ్యక్తిగతంగా పనికొచ్చే అత్యుత్తమ పద్ధతిని ఎంపిక చేసుకోవాలని ఆయన సూచించారు. అనువైన పద్ధతిలో ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయితేనే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
వివిధ రకాల ప్రిపరేషన్ పద్ధతుల గురించి అతిగా ఆలోచించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యార్థులకు ఆయన చెప్పారు. సీబీఎస్‌ఈ, ఐఎస్‌సీఈ, రాష్ట్రాల బోర్డు పరీక్షల తేదీలు సమీపించిన వేళ శుక్రవారం న్యూదిల్లీలోని తన అధికారిక నివాసంలో వరుసగా 9వ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు ఎంపిక చేసిన పలువురు ఎగ్జామ్ వారియర్స్ (విద్యార్థులు) ప్రధానితో ఈ చర్చలో పాల్గొన్నారు.
“డేటా చౌకగా వస్తోంది కదా అని ఇంటర్నెట్‌లో టైం వేస్ట్ చేసుకోకండి. సరదాగా గేమ్స్ ఆడుతూ కాలాన్ని గడిపేయకండి. డబ్బుపై ఆశతో గేమ్స్ ఆడితే జీవితాలు నాశనం అవుతాయి. అందుకే మా ప్రభుత్వం జూదం లాంటి ఆటలను ప్రోత్సహించడం లేదు. ఆన్‌లైన్ జూదానికి వ్యతిరేకంగా మేం ఒక చట్టాన్ని కూడా చేశాం. అయితే గేమ్స్ ఆడటంలోనూ ఒక నైపుణ్యం దాగి ఉంటుంది. గేమ్స్ ఆడేవారు స్పీడ్‌గా స్పందించాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని అప్రమత్తతను అలవర్చుకోవడానికి, స్వీయ వికాసానికి వాడుకోవచ్చు” అని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు.
“మీ జీవితాన్ని, విద్యా నైపుణ్యాలను తీర్చిదిద్దుకోవడంపై ఫోకస్ పెట్టండి. మీరు చదువును భారంగా భావించొద్దు. పరధ్యానంతో చదివితే, జీవితంలో సక్సెస్ కాలేరు. మనం చేరుకోగలిగే లక్ష్యాన్నే పెట్టుకోవాలి. అలా అని ఈజీగా సాధించే లక్ష్యాన్ని పెట్టుకోవద్దు. తొలుత మీ మైండ్‌ను పరీక్షల ప్రిపరేషన్ కోసం రెడీ చేయండి. అనంతరం సబ్జెక్టులతో మైండ్‌ను కనెక్ట్ చేయండి. ఈవిధంగా చదివే విద్యార్థులు తప్పకుండా సక్సెస్ అవుతారు” అని విద్యార్థులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం చేశారు.
ఈసారి ప్రధాని మోదీతో పరీక్షా పే చర్చ కోసం రికార్డు స్థాయిలో 4.5 కోట్ల మందికిపైగా విద్యార్థులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. 2025లో 3.52 కోట్ల మంది, 2024లో 2.26 కోట్ల మంది, 2023లో 38.8 లక్షల మంది విద్యార్థులు ఈ ప్రోగ్రాం కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం గమనార్హం. 2025లో భారీ రిజిస్ట్రేషన్ల కారణంగా పరీక్షా పే చర్చ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటును సంపాదించింది.
More Stories
కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఆర్బీఐ నిర్ణయం
మహిళల ప్రీమియర్ లీగ్ విజేత బెంగళూరు
అజిత్ దోవల్,మార్కో రూబియో భేటీ జరగనే లేదు