యూరోపియన్ యూనియన్, అమెరికాలతో భారతదేశం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల తర్వాత ప్రపంచం స్థిరత్వంపై మరింత విశ్వాసంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు సమాధానమిస్తూ, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి భారతదేశం వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదని, కేవలం ముందుకు సాగాలని మోదీ స్పష్టం చేశారు.
“భారతదేశం అనేక దేశాలతో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. గత కొన్ని రోజుల్లో, మనం 27 దేశాల యూరోపియన్ యూనియన్ కూటమితో కుదుర్చుకున్న ‘అన్ని ఒప్పందాలకు తల్లి లాంటి’ ఒప్పందంతో సహా తొమ్మిది పెద్ద దేశాలతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాము,” అని ఆయన పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్షాలు దేశానికి ఏమి చేశాయో దానికి ఒక రోజు వారు సమాధానం చెప్పాల్సి వస్తుందని ప్రధాని స్పష్టం చేశారు .
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వాల తప్పులను సరిదిద్దడానికే తన శక్తిలో ఎక్కువ భాగం వెచ్చించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. “యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందం జరిగినప్పుడు, ప్రపంచం స్థిరత్వంపై మరింత విశ్వాసం పెంచుకుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం తర్వాత, ప్రపంచానికి ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగింది… ఇది ప్రపంచానికి ఒక మంచి సంకేతం,” అని మోదీ తెలిపారు.
కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రజల కోసం ఏం చేయలేదని ప్రధాని విమర్శించారు. ఈ క్రమంలోనే 2002 నుంచి కాంగ్రెస్ తనపై దూషణలు చేస్తూనే ఉందని మోదీ చెప్పారు. “విపక్ష నేతల దూషణలే నా ఆరోగ్య రహస్యం. సభలో 25 ఏళ్లుగా కాంగ్రెస్ నన్ను అవమానిస్తూనే ఉంది. నన్ను ఒకరు మీ ఆరోగ్య రహస్యం ఏంటని అడిగారు. రోజూ రెండు కిలోల తిట్లు తింటాను అని చెప్పాను.” అనగానే సభలో నవ్వులు పూశాయి.
యూపీఏ హయాంలో భారత్ పరిస్థితులు పూర్తిగా దిగజారాయని చెబుతూ ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించామని, జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని, పాకిస్థాన్‌ను వారి దేశంలోనే ఢీకొట్టామని ప్రధాని గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు మాత్రం తన వినాశనం కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు.
భారత అభివృద్ధిపై కాంగ్రెస్‌కు ఎలాంటి విజన్ లేదమని పేర్కొంటూ కాంగ్రెస్ హయాంలో జనాభాను సమస్యగా భావించారని, నెహ్రూ హయాంలో 35 కోట్ల జనాభాను సమస్యగా భావించారని ప్రధాని తెలిపారు. అయితే తాను మాత్రం 140 కోట్ల జనాభాను పరిష్కారకర్తలుగా భావిస్తున్నానని చెప్పారు. వ్యవస్థలను అవమానించడం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రపతిని లోక్‌సభలో కాంగ్రెస్ నేతలు అవమానించారని పేర్కొంటూ రాష్ట్రపతిని అవమానించడమంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్లే అని స్పష్టం చేశారు.
స్వాతంత్ర్యం తొలి నాళ్లల్లో భారత్ ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేదని, కానీ, మునుపటి ప్రభుత్వాల విధానాల కారణంగా 2014 నాటికి 11వ స్థానికి పడిపోయిందని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతోందని చెప్పారు. ప్రపంచ సవాళ్లకు భారత్ పరిష్కారాలు చూపించే స్థితిలో నిలిచి ఒక ఆశాకిరణంగా మారిందని తెలిపారు. అధిక వృద్ధి రేటు, తక్కువ ద్రవ్యోల్బణం కలగలిసిన అరుదైన స్థితిలో భారత్ ఉందని చెప్పారు.
అటు రైల్వేశాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌గాంధీ వివాదాస్పదం వ్యాఖ్యల చేయడంపైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “కాంగ్రెస్ యువరాజు ఒక ఎంపీని దేశద్రోహి అన్నారు. కాంగ్రెస్ యువరాజు అహంకారం పరాకాష్టకు చేరింది. కాంగ్రెస్ వీడిన మరెవరినీ రాహుల్ దేశద్రోహి అనలేదు. ఎంపీ సిక్కు కావున ఆయన్ని దేశద్రోహిగా అవమానించారు. ఇది సిక్కులకు, గురువులకు అవమానం” అంటూ ధ్వజమెత్తారు.
“సిక్కుల పట్ల కాంగ్రెస్‌లో ఉన్న ద్వేషానికి నిదర్శనం. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబానికి చెందిన ఎంపీ, రాజకీయ సిద్ధాంతం మార్చుకుంటే దేశద్రోహి అయిపోతారా? ఒక పౌరుడిని దేశద్రోహి అనడాన్ని దేశం ఎలా సహిస్తుంది? ఇలాంటి వ్యక్తులు కాంగ్రెస్‌ను ముంచుతారు. ఆఖరికి మహాత్మాగాంధీ ఇంటిపేరును కూడా చోరీ చేశారు.” అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు.

More Stories
మహిళల ప్రీమియర్ లీగ్ విజేత బెంగళూరు
అజిత్ దోవల్,మార్కో రూబియో భేటీ జరగనే లేదు
రష్యా చమురు దిగుమతిని భారత్ పూర్తిగా ఆపలేదు