కల్తీ లడ్డు వాస్తవాలను వెల్లడించనున్న కూటమి నేతలు

కల్తీ లడ్డు వాస్తవాలను వెల్లడించనున్న కూటమి నేతలు
వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన కల్తీ లడ్డూ వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలని కూటమి లోని మూడు పార్టీల నేతలు నిర్ణయించారు.  కల్తీ లడ్డూపై తమకు సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందంటూ వైఎస్సార్సీపీ చేస్తున్న దుష్ప్రచారానికి కలసి కట్టుగా చెక్ పెట్టాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై కూటమి పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు.
 
ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్‌, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, ఆనం రాంనారాయణ రెడ్డి, సత్యకుమార్ యాదవ్, పార్థసారథి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులు పాల్గొన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న వివరాలను నేతలకు వెల్లడించారు. 
 
పవిత్రమైన తిరుమల లడ్డూని కల్తీ చేసిన వైఎస్సార్సీపీ పాలకులు వెంకటేశ్వరస్వామి పైనే దాడికి ఒడిగట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలతో పాటు ఎక్కడ వీలు చిక్కితే అక్కడ అన్నట్లుగా పది దేవాలయాల్లో కల్తీకి పాల్పడడంతో పాటు అనేక దేవాలయాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అన్యమతస్థుడు కావచ్చు.. కానీ డిక్లరేషన్‌ ఇచ్చి ఆయన దర్శనం చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 
 
శ్రీవారిపై జగన్‌కు నమ్మకం ఉంటే డిక్లరేషన్‌ ఎందుకు ఇవ్వలేదంటూ ప్రశ్నించారు. దేవుడి పవిత్రత దెబ్బతీసేందుకే లడ్డూలో రసాయనాలు కలిపారని విమర్శించారు. రసాయనాలు కలిపారని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ఉందని స్పష్టం చేశారు. ఈ మహాపాపంపై వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పారా? అని సీఎం ప్రశ్నించారు.
 
భగవంతుడుపై పగ పట్టి, ఏడుకొండల్ని రెండు కొండలుగా చిత్రీకరించిన నేపథ్యం వైఎస్సార్సీపీదని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ దుయ్యబట్టారు. దేవుడితో పెట్టుకున్నవాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప బతికి ఉన్న దాఖలాలు లేవని ఆక్షేపించారు.  అన్యమతస్థుల ప్రాబల్యం పెంచి దానిని ఓటు బ్యాంకుగా మార్చుకునే కుట్రకు వైఎస్సార్సీపీ తెరలేపిందని బీజేపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్‌ ఆరోపించారు. మహాపచారానికి పాల్పడిన వారిని దేవుడి ముందు మోకరిల్లేలా చేస్తామని కూటమి నేతలు హెచ్చరించారు.
 
బ్రిటీష్ వాళ్లు సైతం వేంకటేశ్వరస్వామి జోలికి రాలేదని, కానీ వైఎస్సార్సీపీ వాళ్లు దేవుడితోనే పెట్టుకున్నారని మండిపడ్డారు. 2022లోనే కల్తీ నిర్ధారణ అయినా ఎందుకు నివేదికను తొక్కిపెట్టారని నిలదీశారు.   వైఎస్సార్సీపీ నేతలు చేయకూడని మహా పాపం చేసి మళ్లీ బూతులు మాట్లాడుతూ మైండ్ గేమ్ ఆడతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిపై విశ్వాసం లేకపోతే భక్తుల మనోభవాల జోలికి రాకూడదని హితవు పలికారు. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.