సిద్ధంగా ఐదు తేజస్ మార్క్‌1-ఏ ఫైట‌ర్ విమానాలు

సిద్ధంగా ఐదు తేజస్ మార్క్‌1-ఏ ఫైట‌ర్ విమానాలు
ఐదు తేజస్ మార్క్‌1-ఏ ఫైట‌ర్ విమానాలు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్న‌ట్లు మిలిట‌రీ విమానాల ఉత్ప‌త్తి సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వెల్లడించింది. భార‌తీయ వైమానిక ద‌ళం కోసం ఈ యుద్ధ విమానాల‌ను ఉత్ప‌త్తి చేశారు. అయితే ఫ్యాక్ట‌రీలో మ‌రో 9 విమానాలు సిద్ధంగా ఉన్నాయ‌ని, అమెరికా జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ సంస్థ స‌ర‌ఫ‌రా చేసే ఇంజిన్ల కోసం ఎదురుచూస్తున్న‌ట్లు హెచ్ఏఎల్ త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది.

డెలివ‌రీ కోసం అయిదు విమానాలు సిద్ధం అయ్యాయ‌ని, ఒప్పందం ప్ర‌కారం ఆ విమానాల‌ను రూపొందించామ‌ని, అద‌నంగా 9 విమానాల‌ను నిర్మించామ‌ని, అమెరికా ఇంజిన్ల కోసం ఎదురుచూస్తున్న బెంగుళూరుకు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ కంపెనీ వెల్ల‌డించింది. జీఈ సంస్థ నుంచి అనుకున్న తేదీ ప్ర‌కారం అయిదు ఇంజిన్లు అందిన‌ట్లు హెచ్ఏఎల్ చెప్పింది. 

ఎఫ్‌404 ఇంజిన్ల స‌ర‌ఫ‌రాలో ఆల‌స్యం వ‌ల్ల తేజ‌స్ మార్క్ 1ఏ జెట్ల డెలివ‌రీ ఆల‌స్యమైన‌ట్లు పేర్కొన్న‌ది. భార‌తీయ వైమానిక ద‌ళం కోసం హెచ్ఏఎల్ సంస్థ 180 యుద్ధ విమానాల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది. వాస్త‌వానికి మార్చి 2024 నాటికి ఆ విమానాల డెలివ‌రీ ప్ర‌క్రియ స్టార్ట్ కావాల్సి ఉంది. కానీ ఇంజిన్ల స‌ర‌ఫ‌రాలో ఆల‌స్యం వ‌ల్ల .. విమానాల ఉత్ప‌త్తిలో జాప్యం జ‌రిగిన‌ట్లు కంపెనీ పేర్కొన్న‌ది.