మణిపూర్ ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు వై ఖేమ్‌చంద్ సింగ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. 62 ఏండ్ల బీజేపీ శాసనసభ్యుడైన ఖేమ్‌చంద్ చేత గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రమాణం చేయించారు. ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రులుగా కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యే ఏ నేంచా కిన్‌జెన్, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యే ఎల్ దిఖో కూడా ప్రమాణం చేశారు.
బీజేపీకి చెందిన ఎమ్మెల్యే గోవిందాస్ కొంతౌజమ్, ఎన్‌పీపీకి చెందిన కే లోకేన్ సింగ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఢిల్లీలోని మణిపూర్ భవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో కిన్‌జెన్ ప్రమాణం చేశారు. అంతకుముందు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించారు. ఆ తర్వాత కొన్ని గంటలకే ఇక్కడి లోక్‌భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
మణిపుర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఖేమ్‌చంద్ సింగ్‌కు అభినందనలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
“మణిపుర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్‌కు అభినందనలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నెమ్చా కిప్‌జెన్, లోసీ డిఖోలకు, అలాగే మణిపుర్ ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కొంతౌజం గోవిందాస్ సింగ్, ఖురైజం లోకెన్ సింగ్‌లకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారంతా మణిపుర్‌లోని నా సోదరీసోదరుల కోసం అభివృద్ధిని, శ్రేయస్సును మరింత ముందుకు తీసుకెళ్లడానికి శ్రద్ధగా కృషి చేస్తారని నేను విశ్వసిస్తున్నాను.” అని ప్రధాని ట్వీట్ చేశారు.
2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ చెలరేగడంతో మణిపుర్ అట్టుడికింది. ఈ హింసాత్మక ఘర్షణల వల్ల కనీసం 260 మందికి పైగా మరణించగా, వేలాది మంది పూర్తిగా నిరాశ్రయులు అయ్యారు. ఈ ఘటనల నేపథ్యంలో గతేడాది ఫిబ్రవరిలో అప్పటి సీఎం బీరెన్‌సింగ్ రాజీనామా చేశారు. అనంతరం రాష్ట్రపతి పాలన విధించారు. దాదాపు ఏడాది తర్వాత బుధవారం ఎత్తివేశారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఈ మేరకు రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ కేంద్ర హోం శాఖ గెజిట్ విడుదల చేసింది. ఆర్టికల్ 356 (2) ప్రకారం రాష్ట్రపతి తీసుకున్న ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వివరించింది.

More Stories
ప్రధాని సీట్ ను చుట్టుముట్టిన వివక్ష మహిళా ఎంపీలు
`నువ్వు మిత్ర ద్రోహి’….. `నువ్వు దేశ ద్రోహి’
జమ్మూలో ఇద్దరు ఉగ్రవాదులు హతం