హెలికాప్టర్ల తయారీకి అదానీ, లియోనార్డో మధ్య ఒప్పందం

హెలికాప్టర్ల తయారీకి అదానీ, లియోనార్డో మధ్య ఒప్పందం

భారత్ లో సమీకృత హెలికాప్టర్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అదానీ గ్రూప్, ఇటలీకి చెందిన ప్రముఖ రక్షణ రంగ సంస్థ లియోనార్డో కీలక ఒప్పందం చేసుకున్నట్లు మంగళవారం ప్రకటించాయి. మేక్ ఇండియా ప్రయత్నాలకు, దేశాన్ని మరింత స్వయంసమృద్ధిగా మార్చడానికి ఇది గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా దేశ సైనిక అవసరాలకు అనుగుణంగా హెలికాప్టర్ల ఉత్పత్తిలో భారత్ స్వావలంబన పెంచడానికి ఇది ఉపయోగపడనుంది.

అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, లియోనార్డో సంస్థలు ఢిల్లీలో ఈ అవగాహన ఒప్పందం (ఎంవోయూ)పై సంతకాలు చేశాయి. భారత సాయుధ దళాల అవసరాలు తీర్చడమే కాకుండా, హెలికాప్టర్ల ఉత్పత్తిలో భారత్ను స్వయంసమృద్ధ దేశంగా మార్చడమే ఈ ఒప్పందం లక్ష్యంగా తెలుస్తోంది.

ఈ ఒప్పందం ప్రకారం, “ఈ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం వల్ల లియోనార్డోకు చెందిన అత్యాధునిక  ఏడబ్ల్యు169ఎం, ఏడబ్ల్యు109 ట్రెక్కర్ఎం  హెలికాప్టర్లు భారత్లో తయారు చేస్తారు. దీని వల్ల భారత సైనిక అవసరాలకు అంతర్జాతీయ స్థాయి సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. అయితే ఇది కేవలం తయారీకే పరిమితం కాకుండా, దశల వారీగా స్వదేశీకరణ (ఇండియనైజేషన్), పటిష్టమైన నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాలింగ్ (ఎంఆర్ఓ) సామర్థ్యాలతో పాటు, పైలట్లకు సమగ్ర శిక్షణను కూడా అందిస్తుంది.”

భారత జనాభాతో పోల్చితే హెలికాప్టర్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. (జనాభా నిష్పత్తి ప్రకారం 250 కంటే తక్కువ హెలికాప్టర్లు ఉన్నాయి.) ఈ లోటును తీర్చేందుకు రానున్న 10 ఏళ్లలో ఏటా సుమారు 100 హెలికాప్టర్లు అవసరం ఉంటుందని అంచనా. అందుకే “దేశ పౌర, రక్షణ అవసరాలు తీర్చే సమీకృత హెలికాప్టర్ తయారీ వ్యవస్థకు పునాది వేస్తున్నాం. తయారీ, అసెంబ్లింగ్, శిక్షణను ఒకే చోటకు చేర్చి, అంతర్జాతీయ స్థాయి మద్దతును భారత్ గడ్డపై ఇస్తాం” అని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ అదానీ తెలిపారు.

“రానున్న దశాబ్దంలో భారత సైన్యానికి 1000 కంటే ఎక్కువ హెలికాప్టర్లు అవసరం అవుతాయి. కనుక అదానీ, లియోనార్డో ఒప్పందం దేశీయ తయారీ కలను సాకారం చేస్తుంది” అని అదానీ కంపెనీ ఈసీఓ ఆశిష్ రాజవంశీ చెప్పారు.

‘భారత్ ఒక పెద్ద మార్కెట్, ఇక్కడి సైనిక దళాల అవసరాలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని లియోనార్డో హెలికాప్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్ జియాన్ పియరో కుటిల్లో చెప్పారు. గత వారం అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, బ్రెజిల్ దిగ్గజం ఎంబ్రేయర్ తో కలిసి ప్రాంతీయ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు కీలక ఒప్పందం చేసుకుంది. తాజాగా లియోనార్డోతో హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఈ రంగంలో అదానీ సంస్థల దూకుడును సూచిస్తోంది.

“రక్షణ రంగంలో భారత్ ఇటలీకి ఒక నమ్మకమైన, దీర్ఘకాలిక భాగస్వామి. హెలికాప్టర్ విభంగాలో లియోనార్డో అత్యాధునిక సాంకేతికతను కలిగి ఉంది. మేము ఇటలీలో మరిన్ని భారత పెట్టుబడులను ఆశిస్తున్నాం. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కేవలం వాణిజ్యం గురించి మాత్రమే కాదు. ఇది మన ఉమ్మడి విలువలు, భద్రతకు సంబంధించింది” అని భారత్ లోని ఇటలీ రాయబారి ఆంటోనియో ఎన్రికో బార్టోలి తెలిపారు.