తిరుమల లడ్డూ కల్తీలో సూత్రధారుల్ని తేల్చేందుకు కమిటీ

తిరుమల లడ్డూ కల్తీలో సూత్రధారుల్ని తేల్చేందుకు కమిటీ

తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంపై అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిటీ​ వేయాలని ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అన్ని అంశాలను పక్కనపెట్టి సిట్ నివేదికపై, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై చర్చించారు.

లడ్డు కల్తీ జరిగిన విధానం, వివిధ విభాగాల తప్పిదాలను వివరిస్తూ నివేదిక ఉంది. ఇందులో ప్రభుత్వానికి సిట్ సమర్పించిన నివేదికలో పాత్రధారులపై మాత్రమే సిఫార్సు చేసిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విచారణ అంశాలకు, ఛార్జ్ షీట్​లో ఉన్న అంశాలు, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జ్ షీట్​లో ఎందుకు మిస్ అయ్యాయనే దానిపై ప్రధానంగా చర్చ జరిగింది.

కమిటీ ఏర్పాటు చేసి నిర్ణీత కాలపరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని కేబినెట్​ సమావేశం అనంతరం మంత్రులు మీడియాకు వివరించారు. తప్పు జరుగుతోందని తెలిసినా నాటి పాలకులు మౌనంగా ఉన్నారని స్పష్టమవుతోందని పేర్కొన్నారు. సిట్ నివేదికతో పాటు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సమాచారం పైనా సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు.

తిరుమల లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారని పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. బీఫ్ టాలో, లార్డ్, ఫిష్ ఆయిల్ లడ్డూకి వాడిన రసాయనాల్లో వాడినట్లు ఎన్డీడీబీ నిర్దారించిందని వెల్లడించారు.  ఎన్డీడీబీ నివేదిక తరహాలోనే లడ్డూలో రసాయనాల వాడకంపై 2022 వైఎస్సార్సీపీ హయాంలోనే సీఎఫ్టీఆరై నాటి ప్రభుత్వానికి ఇచ్చిందని పేర్కొన్నారు.

ఆ నివేదిక ఆధారంగా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా మరింత ప్రోత్సహించటాన్ని ఏమి అనాలని నిలదీశారు. చుక్క పాలు లేకుండా నెయ్యి అంటూ రసాయనాలు తయారు చేసిన విధానంపై ప్రజల్లో చర్చ జరగాలని పిలుపునిచ్చారు.

“తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో పారదర్శత కోసమే ప్రభుత్వ ప్రయత్నం తప్ప రాజకీయ కోణం ఇందులో లేదు. తిరుమల శ్రీవారి పవిత్రత కాపాడే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం చేస్తోంది. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదన్నట్లు వైఎస్సార్సీపీ నేతల మాటలు ఉన్నాయి. లడ్డూలో కల్తీని వైఎస్సార్సీపీ సమర్థిస్తోందా?” అని మంత్రులు పార్ధసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ ప్రశ్నించారు.