వాట్సప్‌ గోప్యతా పాలసీపై సుప్రీంకోర్టు అభ్యంతరం

వాట్సప్‌ గోప్యతా పాలసీపై సుప్రీంకోర్టు అభ్యంతరం
టెక్నాల‌జీ దిగ్గ‌జం, వాట్సాప్ ఓన‌ర్లు మెటా కంపెనీకి సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. మా దేశ ప్రైవ‌సీతో మీరు ఆట‌లాడుకోలేర‌ని, మాకు చెందిన సింగిల్ డిజిట్ డేటాను కూడా షేర్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వ‌బోమ‌ని, మా దేశ చ‌ట్టాల‌ను ఫాలో అవ్వ‌కుంటే, మీరు ఈ దేశాన్ని విడిచి వెళ్లవ‌చ్చు అని చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్ హెచ్చరించారు.

వాట్సప్‌ గోప్యతా పాలసీ 2021లోని ”స్వీకరించండి లేదా వదిలివేయండి” విధానంపై సుప్రీంకోర్టు మంగళవారం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోమాల్య బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 

ఈ పిటిషన్లలో ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖను పార్టీగా చేర్చాలని ఆదేశించింది. వినియోగదారులు రహస్య సమాచారాన్ని పంచుకోవాలని (డేటా షేరింగ్‌) ఒత్తిడి చేస్తోందని సిజెఐ సూర్యకాంత్‌ మౌఖికంగా వ్యాఖ్యానించారు. వినియోగదారుల గోప్యతతతో మీరు ఎలా ఆడుకుంటారు? అని ప్రశ్నించింది.  వాట్సాప్ 2021 ప్రైవ‌సీ పాల‌సీపై కోర్టులో విచార‌ణ జరుగుతూ ఉండగా  ప్ర‌భుత్వం త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాదిస్తూ  యూజ‌ర్ డేటాను క‌మ‌ర్షియ‌ల్ అవ‌స‌రాల కోసం వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. ఆ స‌మ‌యంలో చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్ తీవ్రంగా స్పందించారు. 

“మా రాజ్యాంగాన్ని అనుస‌రించ‌లేని ప‌క్షంలో భారత్ ను వ‌దిలివెళ్లిపోండి” అని స్పష్టం చేశారు. పౌరుల గోప్య‌త‌ను బ‌హిరంగ ప‌ర‌చ‌డాన్ని అమ‌నుతించ‌బోమ‌ని తేల్చి చెప్పారు. ప్రైవ‌సీ పాల‌సీ నిరక్ష్య‌రాసుల‌కు ఎలా అర్థం అవుతుంద‌ని కోర్టు ప్ర‌శ్నించింది. కొన్ని సంద‌ర్భాల్లో మీ పాల‌సీలు అర్థం చేసుకోవ‌డం మాకే ఇబ్బందిగా మారుతుంద‌ని, అలాంట‌ప్పుడు గ్రామీణ భార‌త దేశ ప్ర‌జ‌ల‌కు ప్రైవ‌సీ ఎలా అర్థం అవుతుంద‌ని ప్ర‌శ్నించారు.

తమిళనాడు గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి దానికి ఎలా అర్థం చేసుకుంటారని మీరు ఆశించగలరు? సమాచారాన్ని పంచుకునే ప్రశ్నే లేదని సిజెఐ స్పష్టం చేశారు. డేటా షేరింగ్‌ పేరుతో దేశ ప్రజల గోప్యతా హక్కుతో ఆటలాడుకోలేరని హెచ్చరించారు. ఆమోదయోగ్యమైన మార్గంలో గోప్యతా సమాచారాన్ని దొంగిలిస్తున్నారని, అయితే తాము అనుమతించమని, ఇందుకు కట్టుబడాలని లేకుంటా ఉత్తర్వులు జారీ చేస్తామని సిజెఐ పేర్కొన్నారు. 

వివరణాత్మక ప్రతిస్పందన సమర్పించాల్సిందిగా మెటా, వాట్సప్‌, మాతృసంస్థ మెటాకు కొంత సమయమిచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.  నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఉత్తర్వులను సమర్థించడాన్ని వ్యతిరేకిస్తూ వాట్సప్‌, మెటాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.