ఆ పుస్తకం ప్రచురితమైందా? లేదా? అనే విషయాన్ని స్పష్టం చేయాలని రాహుల్‌ను రాజ్‌నాథ్ కోరారు. ఈ క్రమంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ వేళ సభలో గందరగోళం ఏర్పడింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని మాజీ ఆర్మీ చీఫ్ నరవణే తన పుస్తకంలో రాసుకొచ్చిన అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించింది. వాటిని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించారు.
దీంతో రాహుల్ ప్రసంగాన్ని రాజ్‌నాథ్ సింగ్ అడ్డుకున్నారు. రాహుల్ ప్రచురించని పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ఆ పుస్తకం ప్రామాణీకతను ప్రశ్నించారు. రాజ్‌నాథ్ సింగ్ లేవనెత్తిన అభ్యంతరాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమర్థించారు. ‘మ్యాగజైన్ ఏదైనా రాయవచ్చు. పుస్తకం అధికారికంగా ప్రచురితం కానప్పడు దానికి విశ్వసనీయత ఉండదు’ అని పేర్కొన్నారు.
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాహుల్ మాట్లాడటం సరికాదని చెబుతూ పార్లమెంటరీ విధివిధానాలను పాటించాలని సూచించారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని ఆ పుస్తకం ఎక్కడుందో చూపించాలని అడిగారు. ప్రతిపక్ష నేతగా మీరు ఆరోపణలు చేస్తున్నారే కానీ సభ నిబంధనలను పాటించడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.
దీంతో రాహుల్ వెంటనే ‘ఏమి మాట్లాడమంటారో దయచేసి మీరే చెప్పండి’ అని అడిగారు. దీనిపై స్పీకర్ వెంటనే “నేను మీ సలహాదారుని కాదు. స్పీకర్‌గా సభ సజావుగా సాగేలా చూడటం నా బాధ్యత. నిర్దేశించిన సబ్జెక్ట్ మీదే చర్చ ఉండాలి” అని చెప్పారు. దీంతో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తాను ఈ ప్రత్యేక విషయంపై మాట్లాడాలని ఎప్పుడూ అనుకోలేదని, అయితే బీజేపీకి చెందిన ఎంపీ తేజస్వీ సూర్య కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని ప్రశ్నించిన తర్వాత తాను ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించుకున్నానని రాహుల్ గాంధీ తెలిపారు.
“నేను సభలో ప్రస్తావించినవి డోక్లాంలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించవి. నాలుగు చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించి ఒక పర్వత శ్రేణిని ఆక్రమిస్తున్నాయి. ఈ విషయాన్ని మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే ఆత్మకథ ఆధారంగా ఓ మ్యాగజైన్ తన కథనంలో ఊదహరించింది. ఆ కథనంలోని అంశాలనే నేను సభలో ఉటంకించాను. అవి మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను”అని రాహుల్ వ్యాఖ్యానించారు.

More Stories
వాణిజ్య ఒప్పందంకు ట్రంప్ ఆమోదం… సుంకాలు 7 శాతం తగ్గింపు!
క్రికెట్ బహిష్కరణతో పాక్ వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడ!
దివ్యాంగులకు సులభతరంగా సర్టిఫికేట్ లు ఇవ్వాలి