మీ ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందా?

మీ ఆదేశాలతోనే ఫోన్  ట్యాపింగ్‌ జరిగిందా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనధికార, అక్రమ టెలిఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును సిట్‌ అధికారులు ఆదివారం సుమారు ఐదు గంటలసేపు విచారించారు. నందినగర్‌లోని ఆయన నివాసంలో జరిగిన విచారణలో భాగంగా ప్రభుత్వ అధినేతగా మీకు తెలిసే టెలిఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందా? మావోయిస్టుల పేరిట కొన్నివేల మంది ఫోన్లను ట్యాపింగ్‌ చేయించారా? వంటి ప్రశ్నలను అడిగినట్టు తెలుస్తున్నది.

పదవీ విరమణ పొందిన అధికారులను కీలక బాధ్యతల్లో ఎందుకు కొనసాగించారు? పలు ఎన్నికల్లో గెలుపునకు ఫోన్‌ ట్యాపింగ్‌ మీకు ఒక ఆయుధంగా మారడం వల్లే దానిని కొనసాగించారా? ఫోన్‌ ట్యాపింగ్‌ వల్ల వచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు పాల్పడటంతోనే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎలక్టోరల్‌ బాండ్లు పెద్ద మొత్తంలో వచ్చాయా? అంటూ సిట్‌ అధికారులు కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. 

సిట్‌ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు నేరుగా సమాధానమిచ్చిన కెసిఆర్‌ మరికొన్నిటికి ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ‘ఇదంతా సిల్లీ వ్యవహారం. కేవలం రాజకీయ కక్షతోనే సాగిస్తున్న డ్రామా’ అని ఆయన అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.  హైదరాబాద్‌ నగర స్పెషల్‌ బ్రాంచ్‌ జాయింట్‌ కమిషనర్‌ విజరుకుమార్‌, మహేశ్వరం డిసిపి నారాయణరెడ్డి, గ్రేహౌండ్స్‌ కమాండెంట్‌ రవీందర్‌ రెడ్డి, కూకట్‌పల్లి డిసిపి రితురాజ్‌, శంషాబాద్‌ అదనపు ఎస్‌పి ఎఎస్‌ రావు, ఎసిపిలు శ్రీధర్‌, వెంకటగిరి మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో విచారణ ప్రారంభించారు.

విచారణ గదిలోకి న్యాయవాదులను అనుమతించలేదు. కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ ను విచారణ సమయంలో ఉండటానికి సిట్‌ అధికారు లు అనుమతి ఇచ్చారు. ఇంట్లో ఉన్న హరీశ్‌రావు తదితర నేతలను బయటకు పంపేశారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు సిఎంగా ఉన్న తనను ప్రతిరోజూ ఉదయాన్నే కలిసి శాంతిభద్రతల సమాచారం చెప్పేవారని, ఆ సమాచారం ఎలా సేకరించారనే విషయం తనకు అప్రస్తుతమని కెసిఆర్‌ సమాధానం చెప్పినట్టు సమాచారం. 

‘దేశ భద్రత, ప్రభుత్వ సుస్థిరత, మావోయిస్టుల కదలికలపై ఇంటెలిజెన్స్‌ అధికారులు ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తుంటారు. అది వారి విధుల్లో భాగమని మీకు తెలియదా?’ అని సిట్‌ అధికారులను కెసిఆర్‌ ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ కేసులో తాము అరెస్ట్‌ చేసి విచారించిన అధికారులు కొందరు ‘సుప్రీం’ నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు గతంలో తెలిపిన విషయాన్ని సిట్‌ అధికారులు ప్రస్తావిస్తూ, ‘ఆ సుప్రీం మీరేనా?’ అని ప్రశ్నించినట్లు సమాచారం. కెసిఆర్‌ నేరుగా సమాధానం ఇవ్వలేదని తెలిసింది. 

ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రతా చర్యల్లో భాగంగా సాధారణంగా నిర్వహించే వ్యవహారమని కెసిఆర్‌ వాదించినట్టు సమాచారం. గతంలో తాము సేకరించిన సమాచారాన్ని, పలు ఆధారాలను కెసిఆర్‌ ముందుపెట్టి సిట్‌ అధికారులు ప్రశ్నించారు. మధ్యలో విరామమిస్తూ రాత్రి 7.45 గంటల ప్రాంతంలో విచారణ ముగించి స్టేట్‌మెంట్‌పై కెసిఆర్‌ సంతకం తీసుకున్నట్టు తెలిసింది.

సిట్‌ విచారణ కోసం కేసీఆర్‌ ఆదివారం ఉదయమే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి బయలుదేరి నందినగర్‌లోని నివాసానికి చేరుకున్నారు. అయితే కేసీఆర్‌ను సిట్‌ విచారించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. దీంతో నందినగర్‌ ప్రాంతంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు ట్రంక్‌ పెట్టెల్లో కేసుకు సంబంధించిన అత్యంత కీలకమైన ఎలకా్ట్రనిక్‌ సాక్ష్యాధారాలను, కొన్ని రికార్డులను తీసుకుని వచ్చారు. కేసీఆర్‌ విచారణను ఆసాంతం ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేసేలా ఏర్పాట్లు చేశారు.