ఎన్‌సిపి (ఎస్‌పి)లో పార్టీ విలీనంపై ఊహాగానాల మధ్య, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ)లో భాగంగానే కొనసాగుతుందని ఆ పార్టీ మహారాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు సునీల్ దత్తాత్రేయ తట్కరే స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ నియోజకవర్గం నుండి లోక్‌సభ ఎంపీగా ఉన్న తట్కరే, తమ పార్టీ అజిత్ పవార్ నిర్దేశించిన మార్గంలోనే కొనసాగుతుందని పునరుద్ఘాటించారు.
“ప్రజలు ఏమనుకున్నా, మా వైఖరి స్పష్టం. మేము అజిత్‌దాదా ఇచ్చిన పార్టీని, సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్తాము. ఈ విషయంలో మేము దృఢంగా ఉన్నాము,” అని తట్కరే ముంబైలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. “మేము ఎన్‌డిఎతో ఉన్నాము. ఎన్‌డిఎతోనే ఉంటాము. ఇది అజిత్‌దాదా తీసుకున్న సుదీర్ఘంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం” అని తెలిపారు.
ఎన్‌సిపి విలీనంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఎన్‌సిపి (ఎస్‌పి) అధినేత శరద్ పవార్ మాట్లాడుతూ అజిత్ పవార్ తిరిగి కలవాలని కోరుకున్నారని, దీనికి సంబంధించి ఫిబ్రవరి 12న ఒక ప్రకటన చేయాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారని తెలిపారు.
బిజెపి, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో కూడిన అధికార మహాకూటమిలో చేరాలని అజిత్ పవార్ నిర్ణయించుకున్న తర్వాత 2023లో ఎన్‌సిపిలో చీలిక ఏర్పడిందని ఇక్కడ పేర్కొనాలి. ఇదిలా ఉండగా, అజిత్ పవార్ మరణించిన మూడు రోజులకే సునేత్ర పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంపై తట్కరే సమర్థించుకున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, పార్టీని బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. “మహారాష్ట్రను స్థిరీకరించడానికి, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండాలనే అజిత్ పవార్ ఆశయాన్ని నెరవేర్చడానికి ఆమె ప్రమాణ స్వీకారం చేయడంలో తప్పు లేదు,” అని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును రాజ్యాంగం కల్పించిందని కూడా ఆయన పేర్కొన్నారు.

More Stories
144 ఓట్లతో బలపరీక్షలో నెగ్గిన సీఎం విజయ్
కాన్వాయ్‌ను సగానికి తగ్గించిన ప్రధాని మోదీ!
నీట్ ప్రశ్నాపత్రం లీక్ నాసిక్ నుంచే.. ఒక వ్యక్తి అరెస్ట్