భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌గా కేంద్ర బడ్జెట్‌

భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌గా కేంద్ర బడ్జెట్‌

* పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం.. నిర్మల 

కేంద్ర బడ్జెట్‌ భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్‌గా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2047 మిషన్‌ లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టామని చెప్పా”. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్​సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ బడ్జెట్​ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు.

 
“చరిత్రాత్మక బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. బడ్జెట్‌లో ఆత్మనిర్భర్‌ భారత్‌కు కేటాయింపులు. కేంద్ర బడ్జెట్‌ ద్రవ్యలోటును నియంత్రిస్తుంది. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో మరింత ఊతమిచ్చాం. లోకల్‌ నుంచి గ్లోబల్‌ స్థాయికి భారత్‌ ఎదిగింది. యువశక్తిని ప్రోత్సహించే విధంగా బడ్జెట్‌ ఉంది. యువతకు గేమింగ్‌, టూరిజం, క్రీడా సౌకర్యాలు. వికసిత్‌ భారత్‌ ప్రయాణం వేగవంతానికి బడ్జెట్‌ తోడ్పాటు” అని ప్రధాని తెలిపారు. 
 
“సంస్కరణలకు బడ్జెట్‌ నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. భారత్‌ను డేటా సెంటర్‌గా మార్చేందుకు ట్యాక్స్‌ హాలిడే. ఇది భారత్‌ను డేటా సెంటర్‌ హబ్‌గా మారుస్తుంది. ఉద్యోగాల కల్పనకు కేంద్ర బడ్జెట్‌ మరింత దోహదం చేస్తుంది. కేంద్ర బడ్జెట్‌ నారీశక్తిని ప్రతిబింబిస్తుంది. బడ్జెట్‌లో ఈశాన్య ప్రాంతాల పర్యాటకంపై దృష్టి పెట్టాం,”  అని ప్రధాని చెప్పారు.
 
‘‘ఈ బడ్జెట్ దేశంలోని మహిళా శక్తికి, సాధికారతకు ప్రతిబింబం. ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే భారత ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంది. 140కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మాత్రమే ఇండియా ఉండాలని దేశ ప్రజలు కోరుకోవడం లేదు” అని ప్రధాని స్ఫష్టం చేశారు.

కాగా, బడ్జెట్​లో పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. టెక్నాలజీ పూర్తిస్థాయిలో సామాన్యుడికి ఉపయోగపడాలని అభిప్రాయపడ్డారు. 21వ శతాబ్దం పూర్తిగా టెక్నాలజీదేనని అన్నారు. దివ్యాంగులకు అండగా ఉండేలా అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దేశవ్యాప్తంగా 21 వాటర్‌వేస్‌ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

“బయోఫార్మా రంగం రూపురేఖలు మారబోతున్నాయి. బయోఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం కానున్నాయి. సెమీకండక్టర్ మెషిన్‌ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. అరుదైన ఖనిజాలు వెలికితీతకు ప్రాధాన్యత ఇచ్చాం. ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడులోని అరుదైన ఖనిజాలు వెలికితీస్తాం. దిగుమతులకు ఉపయోగపడేలా 3 కెమికల్ పార్కులు తెస్తున్నాం. అత్యాధునిక అగ్నిమాపక పరికరాలు రాబోతున్నాయి. దేశీయ తయారీ టన్నెల్‌ బోరింగ్ మెషీన్లకు మద్దతిస్తున్నాం” అని నిర్మల చెప్పారు.

ఎలక్ట్రానిక్స్‌ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తామని, బడ్జెట్‌ వికసిత్ భారత్‌కు అండగా నిలుస్తుందని తెలిపారు. ఖాదీ, చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించామని చెప్పారు. రూ.10 వేల కోట్ల ఫండ్‌తో ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలుస్తామని, యువతకు శిక్షణ, ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. సేవారంగం విస్తరణతోనే వికసిత్ భారత్ సాధ్యమని నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు.