రూ.53.47లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్

రూ.53.47లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం రూ.53.47 లక్షల కోట్లతో యూనియన్ బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఆమె వరుసగా ప్రవేశపెట్టిన 9వ బడ్జెట్ కావడం గమనార్హం. వికసిత్ భారత్​లో భాగంగా యువత ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఈ బడ్జెట్​ను తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. పేదలు, బలహీన వర్గాలు, దళితులు, ఆదివాసీల కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.

బడ్జెట్‌ పరిమాణం – రూ.53.47 లక్షల కోట్లు

రెవెన్యూ లోటు – రూ.5,92,344 కోట్లు

ద్రవ్యలోటు – రూ.16,95,768 కోట్లు

రంగాలవారీగా కేటాయింపులు

  • రవాణా రంగం – రూ.5,98,520 కోట్లు
  • రక్షణ రంగం – రూ.5,94,585 కోట్లు
  • గ్రామీణాభివృద్ధి రంగం – రూ.2,73,108 కోట్లు
  • హోంశాఖ కార్యకలాపాలు – రూ.2,55,234 కోట్లు
  • వ్యవసాయ అనుబంధ రంగాలు – రూ.1,62,671 కోట్లు
  • విద్యారంగం – రూ.1,39,289 కోట్లు
  • ఇంధన రంగం – రూ.1,09,029 కోట్లు
  • వైద్య, ఆరోగ్యం – రూ.1,04,599 కోట్లు
  • పట్టణాభివృద్ధి – రూ.85,522 కోట్లు
  • ఐటీ, టెలికాం – రూ.74,560 కోట్లు
  • వాణిజ్యం, పరిశ్రమలు – రూ.70,296 కోట్లు
  • సాంఘిక సంక్షేమం – రూ.62,362 కోట్లు
  • శాస్త్ర సాంకేతిక రంగాలకు – రూ.55,756 కోట్లు
  • పన్ను నిర్వహణ – రూ.45,500 కోట్లు
  • ఆర్థిక నిర్వహణ – రూ.20,649 కోట్లు
  • ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి – రూ.6,812 కోట్లు

6 కీలక రంగాల్లో సంస్కరణలు
దేశ ఆర్థిక సుస్థిరత కోసం 6 కీలక రంగాల్లో సంస్కరణలు చేపడుతున్నట్లు నిర్మలాసీతారామన్​ పేర్కొన్నారు. ఛాంపియన్ ఎంఎస్​ఎంఈలో కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామన్నారు. రూ.10వేల కోట్లతో వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకం తీసుకొస్తామన్నారు. ఫార్మా విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సెమీకండక్టర్​ మిషన్​ 2.0
దేశ సెమీ కండక్టర్‌ రంగం వృద్ధి కోసం ఇండియా సెమీకండక్టర్‌ మిషన్ 2.0 ప్రారంభిస్తామన్నారు. ఇందుకోసం రూ.40వేల కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు.

రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ఏపీ సహా 4 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపడతామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు కోసం ప్రత్యేక మైనింగ్ మిషన్ చేపడతామన్నారు. ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ప్రపంచస్థాయి కంటెయినర్‌ ఉత్పత్తి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు.

జౌళీ రంగానికి కేటాయింపులు
జౌళిరంగం ఆధునీకరణకు కేంద్ర కృషి చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. పరిశ్రమలకు విద్యా సంస్థలు అనుసంధానం చేస్తామన్నారు. మెగా టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేసి, జౌళి ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండింగ్‌ కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతమన్నారు.

మౌలిక సదుపాయాల కోసం
మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తామని నిర్మలమ్మ తెలిపారు. గతేడాది రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా, ఇప్పుడు ఏకంగా రూ.1 లక్ష కోట్లు పెంచారు.

ఏడు నగరాల మధ్య హైస్పీడ్‌ కారిడార్లు
ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్‌, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై, చెన్నై- బెంగళూరు, దిల్లీ-వారణాసి, వారణాసి -సిలిగుడి మధ్య హైస్పీడ్ కారిడార్లు నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

సీ-స్టేషన్ల ఏర్పాటు
కొత్తగా డిడికేటెడ్​ ఫ్లైట్​ కారిడార్​ ఏర్పాటు చేస్తాని నిర్మలా సీతారామన్ చెప్పారు. వారణాసి, పట్నాల్లో షిప్ రిపేర్ కర్మాగారం ఏర్పాటు చేస్తామన్నారు.

ఎన్నారైలకు తాయిళాలు
విదేశాల్లో ఉంటున్న భారతీయులకు నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్‌ చెప్పారు. భారత స్టాక్‌ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపునకు అవకాశం కల్పించారు. మూలధన వ్యయం రూ.12.2లక్షల కోట్లకు పెంచారు. మరోవైపు 5 లక్షల జనాభా దాటిన నగరాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. 5 ప్రాంతీయ వైద్య కేంద్రాలు, విద్య, వైద్య పరిశోధనలు సంస్థల ఏర్పాటు చేస్తామన్నారు.

ఆయుర్వేద ఆస్పత్రుల ఏర్పాటు
దేశంలో 3 ఆయుర్వేద ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆయుష్‌ కేంద్రాల అప్‌గ్రేడేషన్‌ చేస్తామన్నారు. సంప్రదాయ వైద్య పరిశోధనకు జామ్‌నగర్‌లో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రైవేటు రంగంలో పశువైద్య, డయాగ్నస్టిక్స్‌ ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తాన్నారు.

యువత కోసం వైద్య రంగంలో కొత్త కోర్సుల ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. సంప్రదాయ వైద్యంలో పరిశోధనలపై దృష్టి పెడతామన్నారు. తూర్పు భారతంలో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ డిజైన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ఎంఎస్​ఎంఈలకు చేయూత
సూక్ష్మతరహా పరిశ్రమలకు రూ.2వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. స్వయం సమృద్ధ భారతం పేరుతో రూ.2వేల కోట్ల ఫండ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ కొనుగోళ్ల ద్వారా ఎంఎస్‌ఎంఈలకు చేయూత ఇస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈల కోసం కార్పొరేట్ మిత్ర కార్యక్రమం చేపడతామని చెప్పారు.

టెక్స్​టైల్ రంగం కోసం రూ.10వేల కోట్లు
టైక్స్‌టైల్‌ రంగం కోసం 5 సూత్రాలతో ప్రత్యేక కార్యక్రమం చేపడతామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. టైక్స్‌టైల్‌ రంగం కోసం వచ్చే ఐదేళ్లకు రూ.10వేల కోట్లు కేటాయిస్తున్నామన్నారు. అలాగే నేషనల్‌ డిజిటల్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. ఖేలో ఇండియా మిషన్‌లో భాగంగా క్రీడాభివృద్ధి చేస్తామని చెప్పారు. యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, కామిక్‌ రంగాలకు చేయూతనిస్తామన్నారు.

బడ్జెట్‌లో పది కీలకాంశాలు 

1. దేశంలో పెట్టుబడులు పెట్టి, క్లౌడ్ సర్వీసెస్ అందించే డాటా సెంటర్లకు మాత్రం సరళమైన పన్నులు విధించారు. దీనిప్రకారం 2047 వరకు టాక్స్ హాలిడే ఉంటుంది.
2. కేన్సర్ చికిత్స కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అత్యావశ్యక ఔషధాలపై దిగుమతి సుంకాన్ని మినహాయిస్తారు. దీనిలో భాగంగా 17 రకాల ఔషధాలు ధరలు తగ్గుతాయి. అలాగే, అరుదైన వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మరో 7 కీలక ఔషధాలపై కూడా దిగుమతి సుంకాలు తగ్గుతాయి. కేన్సర్ చికిత్సలో వాడే మందులు, ఇతర ఔషధాలు, ఆహార పదార్థాలు, పరికరాలపై కూడా సుంకాలు తగ్గుతాయి.
3. కొత్తగా వచ్చే టెక్నాలజీలపై సమీక్ష జరిపేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు. సెమీ కండక్టర్ల తయారీ సహా, ఇతర సేవారంగాలకు ప్రోత్సాహకంగా ఐదేళ్లలో రూ.40,000 కోట్లు కేటాయిస్తారు.
4. 2026-27 ఆర్థిక సంవత్సరానికిగాను సైన్యానికి రూ.2.19 లక్షల కోట్లు కేటాయిస్తారు. ఇది గత ఏడాదికంటే 21.84 శాతం అదనం. మొత్తం రక్షణ రంగానికి రూ.7.85 లక్షల కోట్లు కేటాయించారు. ఇది మన జీడీపీలో 11 శాతం.
5. వేగంగా, స్తిరమైన అభివృద్ధి సాధించేందుకు తయారీ రంగం, ఇతర చిన్న పరిశ్రమలు వంటి ఆరు కీలక రంగాకు ప్రోత్సాహం అందిస్తారు. ఇండియాను బయో గ్లోబల్ ఫార్మా హబ్‌గా మార్చేందుకు బయో ఫార్మ శక్తి మిషన్ పేరుతో ఐదేళ్లలో రూ.10,000 కోట్లు కేటాయిస్తారు.
6. మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేసి వస్త్ర తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తారు. ఖాదీ, చేతి కళా ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు మహాత్మా గాంధీ గ్రామ సమాజ్ పథకాన్ని అమలు చేస్తారు.
7. బ్యాంకింగ్ రంగాన్ని సమీక్షించేందుకు ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తారు. అలాగే విదేశీ మారక వ్యవస్థను ప్రోత్సహించేందుకు, భారతీయ ఈక్విటీలలో విదేశీయులు పెట్టుబడులు పెట్టేందుకు కూడా కమిటీలను ఏర్పాటు చేస్తారు.
8. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలకు ఏడు హై స్పీడ్ రైల్ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తారు. ఇందులో హైదరాబాద్‌కు సంబంధించి రెండు రైళ్లు నడుస్తాయి. ఒకటి చెన్నై, రెండోది పుణే.
9. రేర్ ఎర్త్ మినరల్స్ (అరుదైన ఖనిజాలు) కోసం చైనా వంటి దేశాలపై ఆధారపడకుండా నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లు ఏర్పాటు చేస్తారు. తమిళనాడు, ఏపీ, కేరళ, ఒడిశాలో ఈ కారిడార్లు ఏర్పాటవుతాయి.
10. మెడికల్ టూరిజంను ప్రోత్సహించేందుకు ప్రత్యేక హబ్స్ ఏర్పాటు చేస్తారు. దీనిలో భాగంగా ఆయుష్ కేంద్రాల పేరుతో ఐదు మెడికల్ హబ్స్ ఏర్పాటు చేస్తారు.