నూతన జాతీయ అధ్యక్షుడిని భారతీయ జనతా పార్టీ ఈనెల 20న ప్రకటించనుంది. ఈ మేరకు పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పదవి కోసం ఈ నెల 19న నామినేషన్లు స్వీకరిస్తామని తెలిపింది. జనవరి 20న కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ రిటర్నింగ్ అధికారి కె.లక్ష్మణ్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈనెల19న మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించవచ్చని తెలిపారు.
తర్వాత నామినేషన్ల పరిశీలన చేపడతామన్నారు. అదేరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండి ఎన్నిక జరపాల్సి వస్తే జనవరి 20న పోలింగ్ నిర్వహించి విజేతను ప్రకటిస్తామని వివరించారు. ఈ ప్రక్రియంతా దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరగనుందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నితిన్ నబీన్ ఎన్నిక లాంఛనమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా స్థానంలో నబీన్ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. యువ నాయకత్వాన్ని తయారు చేసుకోవడడంలో భాగంగా నబీన్‌కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి అగ్రనేతల మద్దతు నితిన్ నబీన్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. 1980 మే 23న రాంచీలో జన్మించిన నబీన్ జన్మించారు. నబీన్‌సిన్హా విద్యాభ్యాసం దిల్లీలో పూర్తయింది.
కాయస్థ సామాజికవర్గానికి చెందిన నబీన్ సిన్హాకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. ఆయన తండ్రి నబీన్‌కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బిహార్‌లో సీనియర్ బీజేపీ నేతగా గుర్తింపు పొందారు. 2005లో తండ్రి ఆకస్మిక మరణంతో నితిన్ 26 ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2006లో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఆ తర్వాత నుంచి ఓటమి చవిచూడలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్‌గఢ్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా పనిచేశారు. అక్కడ బీజేపీని అధికారంలోకి తేవడంలో కీలకంగా వ్యవహరించారు.
గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపుర్ నుంచి ఐదోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నీతీశ్ సర్కార్‌లో రెండు సార్లు మంత్రిగా కూడా పని చేశారు. బిహార్ నుంచి పార్టీలో ఆ స్థాయికి చేరిన తొలినేతగా నబీన్ గుర్తింపు సాధించారు. 2025 డిసెంబర్ 14న బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

More Stories
స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం
మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంపై విస్తృత ప్రచారం.. కేసు నమోదు
మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో మహాయుతి ఘన విజయం