జిల్లాల పునర్విభజన పై రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జిల్లాల పునర్విభజనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తున్నందున నియోజకవర్గాల పునర్విభజన మాదిరిగానే జిల్లాల పునర్విభజనపై బడ్జెట్ సమావేశాల్లోగా కమిషన్ వేస్తామని తెలిపారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల డైరీ 2026 ని సిఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తూ గత ప్రభుత్వం అశాస్త్రీయంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిందని ఆరోపించారు.
దాని వల్ల పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని విమర్శించారు. వరంగల్, హనుమకొండ జి ల్లాలను కలపాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని చెబుతూ ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి త్వరలో రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కమిషన్ ఆరు నెలలపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి జిల్లాలు, మండలాల రేషనలైజేషన్‌పై నివేదిక సమర్పిస్తుందని చెప్పారు.
అన్ని జిల్లా ల్లో మండలాలు సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి, అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుంటామని, విధివిధానాలు రూపొందిస్తామనితెలిపారు. కమిషన్ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొంటూ ఉద్యోగులే తమ సారధులు, వారధులని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు మొత్తం కలిసి తాము 200 మందిమి కూడా లేమని, రాష్ట్రాన్ని 10 లక్షల మంది ఉద్యోగులు నడిపిస్తున్నారని ఆయన చెప్పారు. ఉద్యోగులకు ప్రమాద బీమా కింద రూ.కోటి ఇస్తామని ఆయన హామీనిచ్చారు. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగుల హక్కు అని ఆయన తెలిపారు.

More Stories
రాష్ట్రంలో బిఆర్ఎస్ ఎక్కడ ఉంది?
‘మానస’ లో వృత్తి నైపుణ్యాల ద్వారా దివ్యాంగుల సాధికారత
విబి-జి రామ్ జి చట్టం పారదర్శకతకు ప్రతీక