మారుమూల గ్రామాల్లో ఉండే ఇతర రాష్ట్రాల వారిపై ఏపీ నిఘా

మారుమూల గ్రామాల్లో ఉండే ఇతర రాష్ట్రాల వారిపై ఏపీ నిఘా

* అంతర్గత భద్రత, ఉగ్ర కదలికలపై డేగ కన్ను

రాష్ట్రంలో అంతర్గత భద్రతపై ఏపీ పోలీస్‌శాఖ దృష్టి సారిస్తున్నది. ఇందులో భాగంగా అనేక జిల్లాల్లోని మారుమూల గ్రామాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై నిఘా పెట్టినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, నార్కోటిక్స్‌, డ్రగ్స్‌ రాష్ట్రం గుండా రవాణా జరుగుతుండటంతో ఈగల్‌తో పాటు పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. 

ఈగల్‌ టీమ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగును నిర్మూలించామని చెబుతున్నప్పటికీ నేటికీ రైళ్లు, బస్సులు, ద్విచక్ర వాహనాల ద్వారా రవాణా సాగుతూనే ఉంది. యాంటీ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఈ ఏడాది 1,727 కేసులు నమోదు చేసి, 9,478 మందిని అరెస్టు చేసింది. ఇందుకు సంబంధించి 1,525 వాహనాలను సీజ్‌ చేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. 

ఇటీవల కాలంలో పైలెట్‌ ప్రాజెక్టుగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు 12 రాష్ట్రాలకు చెందిన 343 మందికి పైగా ఉన్నట్లు ఈగల్‌ టీమ్‌ గుర్తించింది. ఒకరిద్దరు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులను ఫాలో అయిన సిబ్బందికి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్‌ సరఫరాదారులతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. 

రాష్ట్రంలో మారుమూల గ్రామాలను వారు ఎందుకు ఎంచుకున్నారు? ఆయా గ్రామాల్లో ఏ వ్యాపారం జరుగుతుందనే అంశంపై నిఘా వర్గాలు ఆరా తీసే పనిలో నిమగమైనట్లు తెలిసింది. మారుమూల, అటవీ ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలోనే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో నవంబరు 18, 19 తేదీల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా, టెక్‌ శంకర్‌ ఎన్‌కౌంటర్‌ కావడం, వివిధ కేడర్లలో పనిచేస్తున్న 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 

వీటితో పాటు గతంలో లొంగిపోయిన సీనియర్‌ కేడర్‌ను మళ్లీ అటువైపు మళ్లకుండా న్యూట్రలైజ్‌ చేయడంపై ఆ శాఖ దృష్టి సారిస్తుంది. మరోవైపు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడటం, కులాలు, మతాల మధ్య ఉద్రిక్తతలను పెంచే వారిపట్ల పోలీస్‌ శాఖ నిఘా పెట్టింది. పేకాట క్లబ్‌లు, అసాంఘిక శక్తుల కదలికలపై సిసి కెమెరాలు, డ్రోన్ల ద్వారా వారి కదలికలను పసిగట్టే పనిలో నిమగమైంది.

రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్న వారెవరు? వారికి ఏ రకమైన సహకారం వీరందిస్తున్నారు? స్థానికంగా ఉన్న వీరికి ఆయా సంస్థలకు ఎలా సంబంధాలు ఏర్పడ్డాయి? వంటి అంశాలపై ఇతర రాష్ట్రాల నిఘా వర్గాలతో కలిసి ఇటీవల రాష్ట్రంలో సంయుక్త ఆపరేషన్లు నిర్వహించాయి. 

ఇటువంటి కేసులకు సంబంధించి విజయనగరం జిల్ల్లాలో ఉగ్రవాదులతో కలిసి కుట్రలో భాగస్వామ్యమయ్యారనే ఆధారాలతో సిరాజ్‌ రహిమాన్‌, సయ్యద్‌ సమీర్‌ అనే ఇద్దరు పాకిస్తాన్‌కు చెందిన ఎహెచ్‌ఐఎం గ్రూప్‌తో సంబంధాలున్నట్లు గుర్తించిన తెలంగాణ, ఆంధ్రా పోలీసులు జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా వారిని అరెస్టు చేశారు. దీంతో ప్రశాంతంగా ఉండే విజయనగరం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 

అన్నమయ్య జిల్లాలో అల్‌ ఉమా ఉగ్రవాదులతో సంబంధాలుండటంతో పాటు 1998 కోయంబత్తూరు సీరియల్‌ బాంబ్‌ బ్లాస్ట్‌లో సంబంధాలుండి 1999లో నకిలీ డాక్యుమెంట్లతో స్థానికంగా ఉన్నవారిని అరెస్టు చేశారు. జెఇఎం కమాండర్‌ తెల్‌హ సోదరుడు మజూజ్‌ అజహర్‌తో కుట్రలు చేశాడనే కారణంతో నూర్‌ మహమ్మద్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది తీవ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తులు అరెస్టు కావడం, మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో పోలీస్‌ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.