టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. వృద్ధుడు సజీవ దహనం

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం.. వృద్ధుడు సజీవ దహనం
విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి.  రైలు ఎలమంచిలి దాటుతున్న సమయంలో బీ1 (బి1) ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

అప్రమత్తమైన లోకో పైలట్‌ వెంటనే రైలును నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే మంటలు పక్కనే ఉన్న ఎం1 (ఎం1), బీ2 (బి2) కోచ్‌లకు కూడా వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి రెండు ఏసీ బోగీలు పూర్తిగా కాలిపోయాయి. పొగను గమనించిన సిబ్బంది వెంటనే ప్రమాదానికి గురైన బోగీలను రైలు నుండి వేరు చేయడంతో ఇతర బోగీలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.

అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే రెండు బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. బి1 బోగీలో ఒకరు సజీవ దహనం కాగా, మృతుడిని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70)గా గుర్తించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి స్టేషన్‌లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

ఈ రైలు అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు సమాచారం. అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పడానికి శ్రమించారు. రెండు బోగీల్లోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. 

హుటాహుటిన అంబులెన్స్‌లను ప్రమాద స్థలానికి రప్పించారు. చలిలో సుమారు 2,000 వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లో పడిగాపులు పడ్డారు.  ఈ నేపథ్యంలో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్లన్నీ నిలుపుదల చేశారు. 3.30 గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించి, ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించారు.

మరోవైపు రెండు బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట స్టేషన్‌కు 3 ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సామర్లకోటలో 2 ఏసీ బోగీలను జత చేసి అక్కడి నుంచి ఎర్నాకుళానికి తరలించనున్నారు. రెండు బోగీల్లోని ప్రయాణికులను ఎర్నాకుళం తరలించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు బోగీల ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు సైతం ఏర్పాట్లను చేశారు.