ఢిల్లీ పేలుడుకు కారణమని భావిస్తున్న డాక్టర్ ఉమర్ నబీ భారీ ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా డిసెంబర్ 6న భారీ బాంబ్ బ్లాస్ట్లకు ప్లాన్ చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఫరీదాబాద్ కేంద్రంగా జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న వైద్యులను, వ్యక్తులను, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను, పొరుగువారిని పోలీసులు తమదైన రీతిలో విచారించగా, ఈ ఉగ్ర కుట్ర బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, బాంబు పేలుడు సంభవించిన ఐ20 కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీ అని తేలింది. కారులో లభించిన నమూనాలతో అతని డీఎన్ఏ సరిపోలడంతో కారు నడిపింది నబీయేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ పేలుడుకు కారణమని భావిస్తున్న ఉమర్ నబీ దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లాకు చెందినవాడు. ఈ 28 ఏళ్ల వైట్ కాలర్ ఉగ్రవాది- కశ్మీర్, హరియాణా, ఉత్తర ప్రదేశ్ లలో విస్తరించి ఉన్న ఉగ్రవాదలు నెట్ వర్క్ లో కీలకంగా ఉన్నాడు. ఇక ఫరీదాబాద్లోని అల్ ఫలా విశ్వవిద్యాలయంలో బోధించే డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై అలియాస్ ముసైబ్ అరెస్టుతో కీలక విషయాలు వెలుగుచూశాయి.
అతని గదిలోంచి ఏకంగా 360 కిలోల అమ్మోనియం నైట్రేట్ దొరికింది. దీనితో ఉమర్ భయాందోళనకు గురయ్యాడని, దీనితో ప్రమాదవశాత్తు పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. “ఉమర్ నబీకి మంచి విద్యా రికార్డు ఉంది. జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేసిన ఎనిమిది మందిలో ఒకడైన గనైతో 2021లో ఉమర్కు పరిచయం ఏర్పడింది. వీరు నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో కలిశారు” అని తెలిపారు.
“ఆ తర్వాత ఉమర్, గనైతో కలిసి అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ లాంటి పేలుడు పదార్థాలను సేకరించడం ప్రారంభించాడు. వాటిని అల్ ఫలా యూనివర్సిటీ క్యాంపస్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిల్వ చేయడం ప్రారంభించాడు. ఆ తర్వాత అతను తన డిసెంబర్ ఉగ్రదాడి ప్రణాళిక గురించి ఇతరులకు తెలియజేశాడు. ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఓపెన్ సోర్స్ నుంచి దాని నిర్మాణం, పేలుడు సర్క్యూట్ గురించి పాఠాలు నేర్చుకున్నాడు. తరువాత అతను కారు పేలుడు కోసం ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (వీబీఐఈడీ)ని అసెంబుల్ చేశాడు” అని దర్యాప్తు అధికారులు తెలిపారు.
మరోవైపు ఉమర్ నబీకి చెందినదిగా అనుమానిస్తున్న రెడ్ కలర్ ఎకోస్పోర్ట్ డిఎల్10సికె 0458 కారును ఫరీదాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది హరియాణాలోని ఖండవాలి గ్రామం సమీపంలోని పార్క్ చేయబడి ఉన్నట్లు వారు తెలిపారు. అంతర్రాష్ట్ర వైట్ కాలర్ జైషే మొహమ్మద్ ఉగ్ర మాడ్యుల్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణపై అరెస్టయిన 8 మందిని పోలీసులు ప్రశ్నించగా ఈ సంచలన వివరాలు వెల్లడైనట్లు ఆ వర్గాలు చెప్పాయి.
కశ్మీరులోని పుల్వామా జిల్లాకు చెందిన 28 ఏళ్ల డాక్టర్ ఉమర్ నబీ కారు పేలుడు ఘటనలో మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కశ్మీరు, హర్యానా, ఉత్తరప్రదేశ్‌కు విస్తరించిన ఉగ్ర మాడ్యుల్‌లో డాక్టర్ ఉమర్ కూడా కీలక సభ్యుడని పోలీసులు భావిస్తున్నారు. అయితే తన బృందంలో సభ్యుడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ అరెస్టుతో ఉమర్ కుట్ర విఫలమైందని, తనను కూడా అరెస్టు చేస్తారన్న భయంతోనే అతను ఐ20 కారులో పేలుడు పదార్థాలను నింపి రెడ్‌ఫోర్ట్ సమీపంలో పేల్చివేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

More Stories
ప్రజల కేంద్రీకృత మార్పులకై వాతావరణ సదస్సులో భారత్ పిలుపు
రెడ్ కారిడార్: అశాంతి ముగింపుకు భారతదేశ సుదీర్ఘ యుద్ధం
తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతి కేంద్రం