ఢిల్లీలో జరిగిన ప్రధాన బాంబు దాడులు ఇవే !!

ఢిల్లీలో జరిగిన ప్రధాన బాంబు దాడులు ఇవే !!
ఢిల్లీ నగరానికి పేలుళ్లు కొత్తవి కావు. గతంలోనూ ఇలాంటి దారుణ ఘటనలు దేశాన్ని కుదిపేశాయి. 2005 అక్టోబర్ 9న, దీపావళి పండుగ ముగిసిన రెండు రోజులకే రాజధాని రక్తసిక్తమైంది. సాయంత్రం 5.38 గంటల నుండి 6.05 గంటల మధ్య కేవలం 27 నిమిషాల వ్యవధిలో వరుసగా పేలుళ్లు సంభవించాయి. సరోజిని నగర్, పహార్గంజ్, గోవింద్‌పురి వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ పేలుళ్లు చోటుచేసుకోవడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. 

ఆ ఘటనలో 67 మంది మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఆ సమయంలో మార్కెట్లు పండుగ కొనుగోళ్లతో కిటకిటలాడుతుండటంతో ప్రాణ నష్టం విపరీతంగా జరిగింది. ఈ దాడిని లష్కర్-ఇ-తయిబా ఉగ్రవాద సంస్థ చేసినట్లు తరువాత దర్యాప్తులో తేలింది. 2008 సెప్టెంబర్ 13న ఢిల్లీ మరోసారి బాంబు దాడుల తాలూకు భయానక దృశ్యాన్ని చూసింది. సాయంత్రం 6.27 గంటలకు పోలీసులకు ఓ ఇమెయిల్ వచ్చింది.

ఆ మెయిల్‌లో పేలుళ్లు జరగబోతున్నాయని హెచ్చరిక ఇచ్చినప్పటికీ, అధికారులు స్పందించేలోపు నగరమంతా కుదిపేసేలా తొమ్మిది వరుస పేలుళ్లు జరిగాయి.  కనాట్ ప్లేస్, గ్రేటర్ కైలాష్, గోకుల్‌పురి, బరఖంబా రోడ్ వంటి రద్దీ ప్రాంతాలు ఆ దాడికి వేదికయ్యాయి. ఈ ఘటనలో 25 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. దిల్లీ వాసుల హృదయాల్లో భయం మళ్లీ ముసురుకుంది. ఆ దాడికి ఇండియన్ ముజాహిద్దీన్ బాధ్యత వహించినట్లు ప్రకటించింది.

ఇక నేడు ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన ఆ భయానక జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసింది. ఈసారి కూడా సాయంత్రం వేళలోనే భారీ శబ్దంతో పేలుడు సంభవించడం ఆ రెండు ఘటనల సమయాన్నే తలపించింది. గత రెండు దశాబ్దాలుగా దిల్లీ నగరం ఉగ్రవాదుల లక్ష్యంగా మారడం దేశ భద్రతా వ్యవస్థలకు పెద్ద సవాలుగా నిలుస్తోంది.

  • 1996, మే 25: లజ్‌పత్‌ నగర్‌ సెంట్రల్‌ మార్కెట్‌లో బాంబు పేలుడు. 16 మంది పౌరులు మృతి
  • 1997 అక్టోబర్‌లో:ఆయా ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. నవంబర్‌లో ఎర్రకోటకు సమీపంలో మరో ముగ్గురు మృతి చెందారు. పంజాబీ బాగ్‌ పేలుడు ఘటనలో . నలుగురు మృతి చెందారు.
  • 2000 జూన్‌ 18: ఎర్రకోటకు సమీపంలో పేలుళ్లు. ఇద్దరు మృతి.
  • 2005 మే 22: లిబర్టీ, సత్యం సినిమా హాల్స్‌లో రెండు పేలుళ్లు. ఒకరు మృతి,
  • 2005 అక్టోబర్‌ 29: సరోజిని నగర్‌, పహార్‌గంజ్‌, గోవింద్‌పురిలలో మూడు బాంబు పేలుళ్లు. 62 మంది మృతి.
  • 100మందికిపైగా గాయాలు
  • 2006 ఏప్రిల్‌ 14: జామా మసీద్‌ ఆవరణలో రెండుచోట్ల పేలుళ్లు. 14 మందికి గాయాలు
  • 2008 సెప్టెంబర్‌ 13: కరోల్‌బాగ్‌ వరుసగా ఐదు బాంబు పేలుళ్లు. 30మంది మృతి. 90 మందికిపైగా గాయాలు.
  • 2008 సెప్టెంబర్‌ 27: మెహ్రౌలీ పూల మార్కెట్‌లో పేలుడు. ముగ్గురు మృతి, 23 మందికి గాయాలు.