 
                ఇరాన్‌లోని చాబహార్ పోర్టు విషయంలో అమెరికా విధించే ఆంక్షలు భారత్‌కు వర్తింపవని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆరు నెలల వరకు అమెరికా ఆంక్షల నుంచి దీనికి తాత్కాలిక మినహాయింపు లభించిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత్ చర్చలు చేస్తూనే ఉందని చెప్పారు.
ఇటీవల రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావంపైనా అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నారు. 140 కోట్ల భారతీయుల ఇంధన భద్రతే లక్ష్యంగా తమ నిర్ణయం ఉంటుందని వివరించారు. మధ్య ఆసియా దేశాలతో భారత్ వాణిజ్యం చేసేందుకు చాబహార్ పోర్టు ప్రధాన మార్గంగా ఉంది. ఈ పోర్టు అభివృద్ధి, నిర్వహణలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో భారీగా పెట్టుబడులు పెట్టింది.
కజఖిస్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, కిర్గిజ్ రిపబ్లిక్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలకు భారత్ ఇక్కడినుంచి సరకు రవాణా చేయవచ్చు. పాకిస్థాన్‌తో సంబంధం లేకుండా అఫ్గానిస్థాన్‌కు భారత్ అందించే ఆహార ధాన్యాలను కూడా ఈ మార్గంలోనే చేరవేస్తున్నారు. ఈ ఓడరేవులో 10ఏళ్ల పాటు టెర్మినల్ నిర్వహణ కోసం గత ఏడాది భారత్-ఇరాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది.
భారత్కు చెందిన ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ సంస్థ 370 మిలియన్ల మేర పెట్టుబడులు పెట్టింది. తొలుత ఆంక్షలు విధించిన అమెరికా, ఆ తర్వాత మినహాయింపును ఇచ్చింది. అయితే, తాజాగా ఆ గడువు ముగిసిన నేపథ్యంలో మళ్లీ ఈ గడువు పొడిగించింది. ఫలితంగా చాబహార్ పోర్ట్‌లోని షహీద్ బెహెస్తీ టెర్మినల్ అభివృద్ధి, నిర్వహణకు భారత్‌కు వీలు కలిగింది.
అయితే, ఈ ఒప్పందం తర్వాత భారత్‌కు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. “ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు విధించింది. వాటి అమలు కొనసాగుతూనే ఉంటుంది. ఏ సంస్థ అయినా, దేశమైనా టెహ్రాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపితే, వారు కూడా వాటి పరిధిలోకి వస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి” అని పేర్కొంది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని అప్పట్లో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అమెరికాకు కౌంటర్ ఇచ్చారు.
“వాషింగ్టన్ గతంలో ఎన్నడూ ఇలా చేయలేదు. చాబహార్ విషయంలో అమెరికా వైఖరే గమనిచండి. ఆ పోర్టును విస్తృత కోణంలో చూస్తే సరైనదే అని వెల్లడించింది. చాలా కాలం నుంచి పోర్టుపై పనిచేస్తున్నాం. కానీ, ఎప్పుడూ సుదీర్ఘకాలం ఒప్పందం చేసుకోలేదు. దీనికి ఇరాన్ వైపు సమస్యలు, జాయింట్ వెంచెర్ భాగస్వామి మార్పులు, నిబంధనలు ఇలా చాల సమస్యలు ఉన్నాయి” అని స్పష్టం చేశారు.
వాస్తవానికి దీర్ఘకాలిక ఒప్పందంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని, చివరికి ఎట్టకేలకు సమస్యలు పరిష్కరించుకొని డీల్‌పై సంతకాలు చేశామని తెలిపారు. ఇది లేకపోతే రేవు నిర్వహణ కష్టమైపోతుందని, అంతిమంగా చాబహార్ వల్ల ఈ ప్రాంతం మొత్తానికి ప్రయోజనం లభిస్తుందని జై శంకర్ పేర్కొన్నారు.





More Stories
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం
యమునా నదిని పరిశుభ్రం చేయడం అసాధ్యం కాదు!