అజారుద్దీన్‌కు మంత్రి ప‌ద‌విపై బీజేపీ ఫిర్యాదు

అజారుద్దీన్‌కు మంత్రి ప‌ద‌విపై బీజేపీ ఫిర్యాదు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ముస్లిం సామాజిక వ‌ర్గానికి చెందిన‌ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడట్లేవు అని ప‌లు సర్వేల్లో తేల‌డంతో అధిష్టానం అనుమతి లేకుండా హడావిడిగా మాజీ క్రికెట‌ర్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాకు లీకులు వదిలారు. ఈ నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి.
 
ఈ నేప‌థ్యంలో అజారుద్దీన్ మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని బీజేపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. ఇది ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘ‌న కింద‌కే వ‌స్తుంద‌ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని  బీజేపీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి,  పాల్వాయి శంకర్  తో పాటు లీగల్ సెల్ డ్డిని కలిసి మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని వారు ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసమే హడావుడిగా మంత్రివర్గ విస్తరణ చేపట్టారని విమర్శించారు. అజారుద్దీన్ గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు. మంత్రివర్గ విస్తరణను నిలిపివేయాలని కోరారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లుగా మైనార్టీల మీద లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారంటూ బీజేపీ ప్ర‌శ్నిస్తుంది.

జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కావాలనే మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ముస్లిం నేత అజారుద్దీన్‌కు మంత్రి పదవి అప్పగిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో ఎన్సిసి కోడ్ కేవలం జూబ్లీహిల్స్ పరిమితమైనప్పటికీ ఇది జూబ్లీహిల్స్‌లోని ఓటర్లను సైతం ప్రభావితం చేస్తున్నందున ఎన్నిక‌ల‌ కోడ్ ఉల్లంఘన కింద పరిగణలోకి తీసుకోవాలి అని ఎన్నిక‌ల అధికారుల‌కు బీజేపీ నేత‌లు విజ్ఞ‌ప్తి చేశారు.

బీఆర్కే భవన్‌ వద్ద నిర్వహించిన మీడయా సమావేశంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ జరపాలంటే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని, కానీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఈ నియమం పాటించలేదని విమర్శించారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేశారు.