జూబ్లీహిల్స్ లో బిజెపి అనుకూల వాతావరణం

జూబ్లీహిల్స్ లో బిజెపి అనుకూల వాతావరణం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూల వాతావరణం ఉందని పేర్కొంటూ బిజెపి గెలుస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ప్రజలు ఇప్పటికే మర్చిపోయారని భరోసా వ్యక్తం చేశారు.  
బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో  జరిగిన పార్టీ పదాధికారుల సమావేశంలో  మాట్లాడుతూ  వచ్చే నెల 11వ తేదీన జూబ్లీహిల్స్‌లో జరగబోయే ఉపఎన్నిక సందర్భంగా, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మరోసారి ప్రజలను మోసం చేయడానికి సిద్ధమవుతున్నాయని తెలిపారు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ ఎంఐఎం-బిజెపి మధ్యే జరుగుతోందని స్పష్టం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అదే ఎంఐఎంకు వేసినట్లే అని తెలిపారు.
 
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి పార్టీ విజయం కోసం కృషి చేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. ప్రధాని  నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను గడపగడపకు చేరేలా ప్రచారం ముమ్మరం చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అరాచకాలను, అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు హామీలు, అమలు కాని “6 గ్యారంటీల”ను ప్రజల ముందు బహిర్గతం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.

100 రోజుల్లో 6 గ్యారంటీలు” అని అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు చేతులెత్తేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి తగిన అభ్యర్థులు లేరని, అందుకనే గతంలో ఎంఐఎం నుంచి పోటీచేసిన అభ్యర్థిని ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తోందని ఎద్దేవా చేశారు.

ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్లలో బైండోవర్ అయ్యే కాంగ్రెస్ అభ్యర్థి కావాలా? లేక ప్రజల మధ్య తిరిగే, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి కోసం పనిచేసే బిజెపి అభ్యర్థి కావాలా? అని తెలిపారు. ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలే తగిన నిర్ణయం తీసుకుంటారని రామచందర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు.

రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు పార్టీని మరింత బలోపేతం చేసేలా, పార్టీ విస్తరణ కోసం సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసి విస్తరించడం ఇక్కడి నాయకులు, కార్యకర్తలపై జాతీయ పార్టీ బలమైన నమ్మకాన్ని ఉంచిందని ఆయన తెలిపారు. బిజెపి జాతీయ పార్టీ సూచనల మేరకు ప్రతిఒక్కరు సమన్వయంతో పార్టీని ముందుగా తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.


పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్ రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.