జమ్ముకాశ్మీర్‌లో ఆప్‌ ఎమ్మెల్యే అరెస్ట్

జమ్ముకాశ్మీర్‌లో ఆప్‌ ఎమ్మెల్యే అరెస్ట్
జమ్ముకాశ్మీర్‌లో ఏకైక ఆప్‌ ఎమ్మెల్యే మెహ్రాజ్‌- ఉద్‌- దిన్‌ మాలిక్‌ను ప్రజా భద్రతా చట్టం (పిఎస్‌ఎ) కింద పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిక్‌ గత ఏడాది జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో దోడా తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆయన ఆప్‌ జమ్ముకాశ్మీర్‌ యూనిట్‌ అధ్యక్షుడుగా ఉన్నారు.  శాంతిభద్రతలకు మాలిక్‌ తీవ్ర ముప్పుగా ఉన్నందు వల్లే పిఎస్‌ఎ కింద కేసు నమోదు చేసినట్లు జమ్మూకాశ్మీర్‌ స్పీకర్‌కు పంపిన లేఖలో దోడా డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ హర్విందర్‌ సింగ్‌ పేర్కొన్నారు.
2019 తరువాత పిఎస్‌ఎ కింద ప్రజా ప్రతినిధిని అరెస్టు చేయడం ఇదే మొదటిసారి.  ఆర్టికల్‌ 370ను రద్దు చేయడానికి ముందు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటి మాజీ ముఖ్యమంత్రులతో పాటు, కొంత మంది ఎమ్మెల్యేలను, న్యాయవాదులను, వ్యాపారవేత్తలను పిఎస్‌ఎ కింద అరెస్టు చేసి నిర్బంధించారు. 
థాత్రి బ్లాక్‌లోని కెంచా గ్రామంలో మెడికల్‌ ఆఫీసర్‌ ఫిర్యాదు మేరకు దోడా పోలీసులు మాలిక్‌, మరో ఐదుగురు వ్యక్తులపై బిఎన్‌ఎస్‌ సెక్షన్లు 221 (ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం), 329(3) (నేపపూరిత ప్రవర్తన), 351(2) (నేరపూరిత బెదిరింపు), 305(ఇ) (దొంగతనం) కింద కేసు నమోదు చేశారు. 
 
ఈ నెల 5 నుంచి కెంచా గ్రామంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఒక భవనం నుంచి మరొక భవనంలోకి మార్చడంపై ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలోనే ఈ అరెస్టు జరిగింది. మాలిక్‌ అరెస్టును అధికార నేషనల్‌ కాన్ఫరెన్స్‌తో పాటు పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి), పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, ఇతరులు ఖండించారు. మాలిక్ పై చర్యను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. “మెహ్రాజ్ మాలిక్ ను పిఎస్ఎ కింద నిర్బంధించడం సమర్థనీయం కాదు. ఆయన ప్రజా భద్రతకు ముప్పు కాదు. ఈ అపఖ్యాతి పాలైన చట్టాన్ని ఉపయోగించి ఆయనను నిర్బంధించడం తప్పు” అని విమర్శించారు. 

 
కాగా, తన ప్రకటనలతో తరచుగా వివాదాలకు దారితీసే మాలిక్ పై ఈ చర్య తీసుకున్నారు.జిల్లాలో ప్రజల కోసం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు పొందిన యువ ఐఎఎస్ అధికారిణి దోడా డిసిపై అసభ్యకరమైన భాషను ఉపయోగించారనే ఆరోపణలపై అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఆయనపై ఈ చర్య తీసుకున్నారు.
 
దెబ్బతిన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని ప్రైవేట్ భవనానికి మార్చడంపై డిప్యూటీ కమిషనర్ దోడా హర్విందర్ సింగ్ పై మెహ్రాజ్ దిన్ మాలిక్ దుర్భాషను ఉపయోగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ 5న తన ఫేస్‌బుక్ పేజీలో ఈ సంఘటనను ఆయన ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు తెలుస్తోంది.  సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న అనేక వీడియోలు మాలిక్ డిప్యూటీ కమిషనర్‌ను మాటలతో దుర్భాషలాడుతున్నట్లు చూపిస్తున్నాయి.