సుప్రీం తీర్పుతో వెల్లడైన తెలంగాణ దర్యాప్తుపై అవిశ్వాసం

సుప్రీం తీర్పుతో వెల్లడైన తెలంగాణ దర్యాప్తుపై అవిశ్వాసం
న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావు మనస్పూర్తిగా స్వాగతించారు. ఈ తీర్పు, రాష్ట్ర ప్రభుత్వాల విచారణ సంస్థలపై ప్రజలలో పెరుగుతున్న అవిశ్వాసానికి స్పష్టమైన నిదర్శనం అని స్పష్టం చేశారు. ప్రజలు ఆశించినట్లుగానే, ఈ దారుణ హత్య కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం, న్యాయం పట్ల నమ్మకాన్ని మరింత బలపరుస్తుందని తెలిపారు.

వామన్ రావు, నాగమణి దంపతులపై జరిగిన ఈ క్రూరమైన హత్య, రాష్ట్రంలో న్యాయవాదుల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తిందని పేర్కొంటూ స్థానిక విచారణ సంస్థలు నిజాన్ని వెలికితీయడంలో విఫలమవుతాయన్న భయం, సాక్ష్యాలను మాయ చేయడం, ఒత్తిళ్లతో కేసును బలహీనపరచే ప్రయత్నాలు ప్రజల్లో ఆందోళన కలిగించాయని తెలిపారు.
సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలను వెలికితీసి, దోషులకు చట్టపరమైన కఠిన శిక్షలు విధించడానికి కృషి చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కేసు, భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి గట్టి హెచ్చరికగా నిలవాలని ఆయన చెప్పారు. అదేవిధంగా, ఈ తీర్పు దేశవ్యాప్తంగా న్యాయం పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఒక మైలురాయి అవుతుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు.  గతంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనే, న్యాయవాదుల భద్రత కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేకసార్లు డిమాండ్ చేశానని రామచందర్ రావు గుర్తు చేశారు.
ఈ అంశంపై శాసన మండలిలో పునరావృతంగా మాట్లాడానని, కానీ అప్పటి ప్రభుత్వాలు ఈ అంశాన్ని నిర్లక్ష్యం చేశాయని ఆయన ధ్వజమెత్తారు.  ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకువస్తామని హామీ ఇచ్చిందని పేర్కొంటూ ఆ హామీని ఇప్పటికైనా నెరవేర్చాలని బీజేపీనేత డిమాండ్ చేశారు.  రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయన కోరారు. 
 
న్యాయవాదులపై దాడులు, హత్యలు ఆగాలంటే ఈ చట్టం తప్పనిసరిగా అమల్లోకి రావాలని స్పష్టం చేశారు.  వామన్ రావు దంపతుల హత్య వంటి ఘోర సంఘటనలు మళ్లీ జరగకుండా, న్యాయవాదుల భద్రతను కాపాడే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన తెలిపారు. న్యాయం జరిగే వరకు, న్యాయవాదుల గౌరవం, భద్రత కోసం బిజెపి పోరాటాన్ని కొనసాగిస్తుందని చెప్పారు.