తెలంగాణలో మరికొద్దిరోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఉత్తర కోస్తాంధ్రను ఆనుకొని ఉన్న తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో సగటు సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో బుధవారం వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశాలున్నాయని, తర్వాతి 48 గంటల్లో బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. మూడు రోజుల పాటు అన్నిశాఖల ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు వరద ప్రభావ జిల్లాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల సేవలు వాడాలని సూచించారు.
అవసరమైతే విద్యా సంస్థలకు సెలవులపై చర్యలు తీసుకోవాలని, ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. వీలైనంత వరకు ప్రజలు రహదారులపైకి రాకుండా చూడాలని, ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశు సంపదకు నష్టం జరగకుండా చూడాలని పేర్కొన్నారు. జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
సహాయక చర్యలకు అవసరమైన నిధులు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండి విద్యుత్ అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఆకస్మిక వరదలు వస్తే ఎయిర్ లిఫ్టింగ్‌కు హెలికాప్టర్లు ఉండేలా చూసుకోవాలని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఉద్యోగులు, సిబ్బంది సెలవులు రద్దు చేసి 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాగా, రాబోయే మూడు రోజులు హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైడ్రా తెలిపింది. మేడ్చల్ జిల్లాతో పాటు సైబరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 10 నుంచి 15 సెంటీ మీటర్లు, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీ మీటర్ల వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ వాహనాలు తీసుకొని రహదారులపైకి రావొద్దని హైడ్రా విజ్ఞప్తి చేసింది.
More Stories
హైదరాబాద్ భారతీయ ఆత్మలో భాగమైన నిర్ణయాత్మక రోజు
హనీట్రాప్‌లో ఓ ప్రముఖ యోగా గురువు
ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర