మాధవ్ `సారద్యం’ పర్యటనల పట్ల మోదీ అభినందన

మాధవ్ `సారద్యం’ పర్యటనల పట్ల మోదీ అభినందన
ఏపీ బిజెపి అధ్యక్ష పదవి చేపట్టిన పీవీఎన్ మాధవ్ జిల్లాల వారీగా `సారధ్యం’ పర్యటనలు జరుపుతూ, పార్టీ కార్యకర్తలతో మమేకం అవుతూ, వివిధ వర్గాలను కలుస్తూ పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. శుక్రవారం ఢిల్లీలో ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన మాధవ్ తన పర్యటన విశేషాలను వివరించారు.
 
పార్టీ బలోపేతం కి మాధవ్ చేస్తున్న సారద్యం పర్యటన గురించి, క్యాడరు లో కనిపిస్తున్న ఉత్సాహం గురించి తెలుసుకొని అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ప్రధాని పలు సలహాలు, సూచనలు ఇచ్చారని మాధవ్ ఈ సందర్భంగా చెప్పారు.  ట్రంప్ టారిఫ్ వల్ల ఆక్వా రైతుల ఇబ్బందులు ప్రధానికి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.
ప్రస్తుతం ఆక్వా రైతులకు నష్టం కలుగుతోందని తెలపగా  ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నామని ప్రధాని చెప్పినట్టు ఆయన వెల్లడించారు.  
ప్రధాని దృష్టికి రాష్ట్రంలోని రైతులు, ఇతర వర్గాల సమస్యలను తీసుకెళ్ళినట్టు మాధవ్ వివరించారు.  ఏపీలో పార్టీ అభివృద్ధిపై రోడ్ మ్యాప్‌ను ప్రధానికి వివరించానని మాధవ్ తెలిపారు.  హర్ ఘర్ తిరంగాను ప్రతి గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించామని తెలియ చేసినట్టు చెప్పారు. కాగా, వైసీపీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు తమ పార్టీ మద్దతు లేదని ఈ సందర్బంగా మాధవ్ కుండ బ్రద్దలు కొట్టినట్టు తెలిపారు వైసీపీకి కేంద్రం మద్దతు ఉందన్న ప్రచారం అవాస్తవం అని స్పష్టం చేశారు. 
వైసీపీ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ రాజీలేని పోరాటం చేస్తోందని తేల్చి చెప్పారు.  అమరావతిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూకేటాయింపుల్లో ఒక విధానం ఉందని చెబుతూ గతంలో కొన్ని సంస్థలకు రాయితీలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఒక విధానం ఉన్నందున భూ కేటాయింపుల్లో ఎలాంటి పక్షపాతం లేదని మాధవ్ స్పష్టం చేశారు.