ఫోన్ ట్యాఫింగ్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇవ్వట్లేదని బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఫోన్ ట్యాఫింగ్ కేసులో సిట్ విచారణకు శుక్రవారం హాజరైన ఆయన ఫోన్ ట్యాపింగ్ పై తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ విచారణలో సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సిట్ అధికారుల మీద తనకు నమ్మకం లేదని స్పష్టం చేస్తూ కమిషన్లు, విచారణ పేరుతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు.
బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని, ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ మాజీ సిఎం కెసిఆర్ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకు అప్పగిస్తే మొత్తం బయటపెడతామని సూచించారు. సిట్ విచారణకు హాజరై అడిగిన వివరాలు ఇచ్చానని, తన వద్ద ఉన్న రికార్డులు, ఆధారాలు సిట్ కు అందజేశానని తెలియజేశారు.
కేంద్రమంత్రిగా, బాధ్యత గల పౌరుడిగా ఆధారాలు సమర్పించానని పేర్కొంటూ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ను మొదట బయటపెట్టిందే తాను అని గుర్తు చేశారు. సిట్ విచారణలో పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి షాక్ అయిన్నట్టు చెబుతూ తన ఫోన్, తన కుటుంబ సభ్యులతోపాటు తన ఓఎస్డీ, వ్యక్తిగత సిబ్బంది ఫోన్ ట్యాప్ అయినట్లు తెలిపారు. 6,500 మంది ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని చెప్పారు.
తనతోపాటు రేవంత్ రెడ్డి, హరీష్ రావు సహా ఆనాటి మంత్రుల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పోన్లను కూడా ట్యాప్ చేశారని తెలిపారు. మావోయిస్టుల పేర్లు చెప్పి నాతోపాటు ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఫోన్లను ట్యాప్ చేశారని విస్మయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో భార్యాభర్తల ఫోన్ సంభాషణలూ కూడా విన్నారంటూ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Stories
మంచిర్యాల రైతుల దుర్మరణం పట్ల బీజేపీ దిగ్బ్రాంతి
కొండా సురేఖ `శ్రీరామ్’ వాఖ్యలపై భగ్గుమన్న బిజెపి
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ బీజేపీకే అధికారం