జస్టిస్ ప్రశాంత్ కుమార్ పై చర్యలు వెనక్కు తీసుకున్న సుప్రీం

జస్టిస్ ప్రశాంత్ కుమార్ పై చర్యలు వెనక్కు తీసుకున్న సుప్రీం

అలహాబాద్​ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ప్రశాంత్ కుమార్​కు క్రిమినల్ కేసులు అప్పగించవద్దని ఈ నెల 4న జారీచేసిన వివాదాస్పదమైన ఆదేశాలను ఉపసంహరించుకుంది. ఈ ఉత్తరువులను జారీచేసిన జస్టిస్​ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ బీఆర్​ గవాయ్ ఓ లేఖలో జస్టిస్​ ప్రశాంత్ కుమార్​ విషయంలో ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని కోరారు. దీనితో ఆగస్టు 4న తాము ఇచ్చిన ఆదేశాల్లోని 2 పేరాలను సర్వోన్నత న్యాయస్థానం తొలగించింది.

దీనిపై జస్టిస్ పార్దివాలా, “దేశ ప్రజల మనస్సుల్లో మన న్యాయవ్యవస్థ గౌరవం ఉండేలా చూసుకోవడమే లక్ష్యంగా ఆగస్టు 4న మేము ఉత్తర్వులు ఇచ్చాం. ఇది మన న్యాయవ్యవస్థపై విశ్వాసం బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది. అయితే సీజేఐ రాతపూర్వకంగా అభ్యర్థన చేసినందున, ఆయనపై గౌరవంతో, మేము ఆగస్టు 4న ఇచ్చిన ఆదేశాల్లోంచి వరుసగా 25, 26 పేరాలను తొలగిస్తున్నాము” అని ప్రకటించారు. 

“అయితే మేము ఈ పేరాగ్రాఫ్​లను తొలగిస్తున్నప్పటికీ, వీటిని పరిశీలించే బాధ్యతను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వదిలేస్తున్నాం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రోస్టర్ నిర్ణయించే అధికారం ఉంటుందని మేము అంగీకరిస్తున్నాం. మేము జారీ చేసిన ఆదేశాలు కూడా హైకోర్టు పారిపాలనాధికారంలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని మేము స్పష్టం చేస్తున్నాం. అయితే సంస్థాగతంగా చట్ట పాలనను ప్రభావితం చేసే పరిస్థితిలు ఏర్పడినప్పుడు కచ్చితంగా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది.” అని పేర్కొన్నారు.

జస్టిస్ ఆర్​.మహదేవన్ దీనిపై స్పందిస్తూ, “ఆ ఆదేశాలు న్యాయమూర్తి తప్పు లేదా పొరపాటుకు సంబంధించిన విషయం కాదు. అవి న్యాయవ్యవస్థపై గౌరవం, విశ్వాసాన్ని కాపాడే దృక్పథంతో జారీ చేసిన ఆదేశాలు” అని స్పష్టం చేశారు.

“అలహాదాబ్ హైకోర్టు న్యాయమూర్తిని అనుభవజ్ఞులైన సీనియర్ న్యాయమూర్తులతో కూడిన డివిజన్ బెంచ్​లో కూర్చోబెట్టాలి. సదరు న్యాయమూర్తి పదవి నుంచి తప్పుకునే వరకు ఆయనకు ఎలాంటి నేర నిర్ధరణ కేసులు అప్పగించరాదు. ఒకవేళ ఆయనను సింగిల్ జడ్జిగా కూర్చోబెట్టాల్సి వస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు క్రిమినల్ కేసులు కేటాయించకూడదు” అని గతంలో జారీచేసిన ఆదేశాలను ఉపసంహరించుకున్నారు.

ఒక సివిల్‌ వివాదంలో క్రిమినల్‌ చర్యలకు అనుమతినిస్తూ అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్​ ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు న్యాయమూర్తికి ఎలాంటి క్రిమినల్‌ కేసులు అప్పగించవద్దని ఈనెల 4న సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.  అయితే సుప్రీంకోర్టు ఆదేశాల్లోని కొన్ని అంశాలు అమలుకాకుండా నిరోధించేందుకు ఫుల్‌ కోర్టును సమావేశపరచాలని అలహాబాద్‌ హైకోర్టుకు చెందిన 13 మంది న్యాయమూర్తులు గురువారం అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఓ లేఖ రాశారు. హైకోర్టులపై పాలనాపరమైన పర్యవేక్షణ అధికారం సుప్రీంకోర్టుకు లేదని స్పష్టం చేశారు.