సింధు జల ఒప్పందంపై ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఘాటుగా స్పందిస్తూ పాకిస్థాన్‌లో సహజ వనరుల వెలికితీత, వాటి వినియోగంలో సైన్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటోందని భారత్ ఆరోపించింది. సింధు జల ఒప్పందంపై భారత్ వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందని, ఇప్పటికే పలు వేదికలపై దీనిని వెల్లడించామని స్పష్టం చేసింది.
సహజ వనరులు, సంఘర్షణలపై లైబీరియా నిర్వహించిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో ద్వైపాక్షిక వివాదాలను ప్రస్తావించడం తమ ఉద్దేశం కాదని, అయితే పాకిస్థాన్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ స్పష్టం చేశారు. సైనిక నాయకత్వం దేశ సంపదను ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని విమర్శించారు.
పాకిస్థాన్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ గత ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖనిజాలతో నిండిన చెక్క పెట్టెను బహూకరించిన ఘటనను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఈ ఘటన పాక్ సైన్యానికి సహజ వనరుల వ్యవహారాల్లో ఉన్న పాత్రను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో ఇటీవల ఒక ప్రాంతీయ ప్రభుత్వాన్ని తొలగించడం, అక్కడ అత్యవసర పరిస్థితి విధించడం వెనుక కూడా వనరులపై నియంత్రణకు సంబంధించిన అంశాలు ఉన్నట్లు భావిస్తున్నారని హరీశ్ పేర్కొన్నారు.
అయితే ఈ పరిణామాలకు ఖనిజ వనరుల వ్యవహారమే కారణమని ఆయన ఆరోపణగా మాత్రమే ప్రస్తావించారు. పాకిస్థాన్ సైన్యం పొరుగు దేశాల్లో సంఘర్షణలను ప్రోత్సహించడం మానుకోవాలని, దాని ప్రభావం తిరిగి ఆ దేశానికే ఎదురవుతోందని అన్నారు. సైన్యం తన స్వప్రయోజనాల కంటే సామాన్య ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
సహజ వనరుల నిర్వహణ విషయంలో భారత్ తన వైఖరిని కూడా ఈ సమావేశంలో వివరించింది. కొత్త అంతర్జాతీయ నిబంధనలను రూపొందించడం కంటే, అక్రమ వాణిజ్యాన్ని అడ్డుకుంటూనే చట్టబద్ధమైన వ్యాపారానికి ఆటంకం కలిగించని ఇప్పటికే అమల్లో ఉన్న స్వచ్ఛంద విధానాలను బలోపేతం చేయాలని హరీశ్ అభిప్రాయపడ్డారు. దేశాల మధ్య సహకారం స్వచ్ఛందంగా, ఏకాభిప్రాయంతో, ఆయా దేశాల నాయకత్వంలో కొనసాగినప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
సహజ వనరులు లభించే ప్రాంతాల్లోని స్థానిక ప్రజలకు వాటి ద్వారా వచ్చే సంపదలో నేరుగా ప్రయోజనం కలగాలని హరీశ్ స్పష్టం చేశారు. ఇందుకు భారత్‌లోని గనుల చట్టాలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఖనిజాల తవ్వకాలు చేపట్టే సంస్థలు స్థానిక సమాజాల అభివృద్ధికి నిధులు కేటాయించేలా చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని వివరించారు. వనరులపై సైనిక నియంత్రణ కంటే స్థానిక ప్రజల భాగస్వామ్యం, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
More Stories
భారతీయులకు వీసా ఫ్రీ ప్రవేశం నిలిపివేసిన మలేసియా
అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు
అణుయుద్ధంలో గెలవలేం, దానిని ఎన్నడూ చేయకూడదు