ఈ వారం ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్పీఓ) సమావేశంలో తన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న పాకిస్తాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్‌కు, ముఖ్యంగా నీటి పంపిణీ విషయంలో, చర్చనీయాంశమైన దూకుడు వ్యాఖ్యలు చేసిన చరిత్ర ఉంది. గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే భారత్ ఏకపక్షంగా సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపై, మాలిక్ ఈ ఏడాది ఆరంభంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
“మా నీటిని తాకిన వారి చేతులు నరికేస్తాం,” అని జూన్‌లో జరిగిన ఒక సెమినార్లో మాలిక్ పేర్కొన్నారు. దుషాన్బేలో జరిగిన ఒక నీటి సదస్సులో, మాలిక్ “నీటి దురాక్రమణ” పట్ల హెచ్చరిస్తూ, 1960 నాటి ఒప్పందాన్ని గౌరవించాలని భారత్‌ను కోరారు. 2023లో గోవాలో జరిగిన ఎస్సీఓ సమావేశానికి బిలవల్ భుట్టో జర్దారీ హాజరైన తర్వాత ఒక పాకిస్తానీ ఫెడరల్ మంత్రి భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి.
న్యూఢిల్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తారా? అని అడగ్గా, ఇది “ద్వైపాక్షిక చర్చ కాదు” అని మాలిక్ అన్నట్లు సమాచారం. 2025 మేలో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం చేపట్టిన సైనిక చర్య ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం ఒక పాకిస్తానీ నాయకుడు భారతదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి.
నవంబర్ 20 నుండి 22 వరకు జరగనున్న ఎస్పీఓ నాగరికతా సంభాషణల వేదికకు, పాకిస్తాన్ జాతీయ వారసత్వ, సాంస్కృతిక శాఖ ఫెడరల్ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీకి న్యూఢిల్లీ అక్టోబర్‌లో లాంఛనంగా ఆహ్వానం పంపింది. ఆ తర్వాత ఇస్లామాబాద్, ఆయనకు బదులుగా ముసాదిక్ మాలిక్‌ను పాల్గొనేందుకు నామినేట్ చేసింది.
“నాగరికతల మధ్య సంభాషణలను ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తెలిపింది. 2026-27లో ఎస్పీఓ దేశాధినేతల మండలి (సిఎచ్ఎస్)కి అధ్యక్షత వహించనున్న పాకిస్తాన్, ఈ సంభాషణలలో పాల్గొంటుందని ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ శుక్రవారం తెలిపారు.
ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ హాజరయ్యే అవకాశం ఉందని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ శుక్రవారం తెలిపారు. చైనా, కజకిస్తాన్, ఇరాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌తో సహా 15 దేశాలు ఇందులో పాల్గొంటాయని ఆయన చెప్పారు. భారతదేశం ఢిల్లీలోని చారిత్రాత్మక పురానా ఖిలాలో ఈ సమావేశానికి ఆతిథ్యం ఇస్తుంది.
`నాగరిక సంభాషణల వేదిక’ భారతదేశపు ప్రధాన ఎస్పీఓ కార్యక్రమం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని ప్రతిపాదించగా, ఈ సంవత్సరం ఇది తొలిసారిగా జరుగుతోంది. ఎస్పీఓ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక అవగాహన, ఉమ్మడి వారసత్వం, ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలను ప్రోత్సహించడమే ఈ వేదిక లక్ష్యమని అధికారులు తెలిపారు.

More Stories
భద్రతా పరీక్షల్లో చాట్‌జీపీటీ సహా నాలుగు ఏఐ చాట్బాట్లు విఫలం
ఇండో-పసిఫిక్ ఉమ్మడి క్వాడ్ భద్రతా వ్యవస్థ
ట్రంప్ హత్య కుట్రలో పాక్ జాతీయుడికి 27 ఏళ్ళ జైలు