ఖర్గే ‘దీపావళి ఖుషియోం కా ఈద్’ వ్యాఖ్యపై బీజేపీ మండిపాటు 

దీపావళిని “ఖుషియోన్ కా ఈద్” అని అభివర్ణించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) మండిపడింది. ఆయనను “సనాతన్ వ్యతిరేక” అంటూ ధ్వజమెత్తింది. దీపావళి సందర్భంగా ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ, కాంగ్రెస్ నాయకుడు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. 
 
ఎక్స్ ల పెట్టిన ఒక పోస్టులో, 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా ఆ బీజేపీ నాయకుడు ప్రస్తావించారు. “కాంగ్రెస్ అధ్యక్షురాలు దీపావళిని ‘సంతోషాల ఈద్’ అని పిలుస్తారు! దీపావళి రోజున కూడా కాంగ్రెస్ బుజ్జగింపు, ఓటు బ్యాంకు గురించే ఆలోచిస్తుంది! నిన్న సోనియా గాంధీ బాబ్రీ కోసం ఏడ్చారు, ఈరోజు ఖర్గే తన దీపావళి సందేశంలో బుజ్జగిస్తున్నారు! కాంగ్రెస్ సనాతన వ్యతిరేకి!” అని బీజేపీ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. 
 
సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ విడుదలకు ముందు ‘ది గార్డియన్’ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. 1992 డిసెంబర్ 6 నాటి సంఘటనలను గుర్తుచేసుకుంటూ, టెలివిజన్‌లో బాబ్రీ మసీదు కూల్చివేతను చూసి తాను ఏడ్చానని ఆమె పేర్కొన్నారు. భారతదేశం తన లౌకిక పునాదులను కాపాడుకోవడానికి సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని ఆ సంఘటన తనకు తెలియజేసిందని ఆమె చెప్పారు. 
 
కాంగ్రెస్ అనేక విధాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, ఇది బీజేపీ, దాని హిందుత్వ రాజకీయాల ఎదుగుదలకు పాక్షికంగా దోహదపడిందని గాంధీ అంగీకరించారు. ఆమె వ్యాఖ్యలు రాజకీయ వాగ్వాదానికి దారితీశాయి. కాంగ్రెస్ బాబర్‌ పట్ల సానుభూతితో ఉందని బీజేపీ నాయకులు ఆరోపించగా, కూల్చివేతను టెలివిజన్‌లో చూసినట్లు గాంధీ చెప్పిన విషయాన్ని వారు ప్రశ్నించారు.
 
“దీనిని బట్టి అప్పట్లో బాబర్ కాంగ్రెస్ పార్టీ హృదయంలో ఉన్నారని, నేటికీ ఆయన ఆ పార్టీ హృదయంలోనే ఉన్నారని తెలుస్తోంది,” అని రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఎద్దేవా చేశారు. 

About The Author