ఏపీపీఎస్సీ గ్రూప్-1 అక్రమాలపై ఈడీ సోదాలు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాల్లో మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడటంతో పాటు, ఒక ప్రైవేటు సంస్థకు రూ.1.14 కోట్లు ఎఫ్ఐఆర్‌లో ఆరోపణలు ఉన్నాయి.  ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డిజిటల్ మూల్యాంకనాన్ని పక్కనపెట్టి మాన్యువల్ మూల్యాంకనం చేపట్టారు.
ఏపీపీఎస్సీకి రెగ్యులర్ చైర్మన్ లేని సమయంలో అప్పటి కార్యదర్శి మాన్యువల్ మూల్యాంకనం బాధ్యతను మెస్సర్స్ క్యామ్సింగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు.

గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష జవాబు పత్రాలను గుంటూరు జిల్లా చినకాకాని గ్రామంలోని హాయ్‌ల్యాండ్ రిసార్టుకు తరలించి 2021 డిసెంబర్ నుంచి 2022 ఫిబ్రవరి వరకు సుమారు 84 రోజులపాటు జవాబు పత్రాలను అక్కడే ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే, అక్కడ జవాబు పత్రాలకు వాస్తవంగా మాన్యువల్ మూల్యాంకనం జరగలేదని ఆరోపణలు ఉన్నాయి.

గతంలో మెస్సర్స్ ట్రూ గ్రేడర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులనే మాన్యువల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులుగా చూపించినట్లు ఈడీ దర్యాప్తులో ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

2022 ఫిబ్రవరి 19న కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఏపీపీఎస్సీ చైర్మన్ గతంలో మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను తిరిగి తెప్పించారు. గతంలో ప్రకటించిన ఫలితాల షీట్లను కూడా వెనక్కి తీసుకున్నారు. అనంతరం ఏపీపీఎస్సీ కార్యాలయ ప్రాంగణంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో మళ్లీ మాన్యువల్ మూల్యాంకనం నిర్వహించారు. ఈ మూల్యాంకనం ఆధారంగానే తుది ఫలితాలు, ఎంపిక జాబితాను ప్రకటించారు.

దీంతో అంతకుముందు నిర్వహించినట్లు చెప్పిన మాన్యువల్ మూల్యాంకనం విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాస్తవంగా సేవలు అందించకుండానే రూ.1.14 కోట్లు చెల్లించినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఇది మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నేరపూరిత కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది. 

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు అప్పటి  ఏపీపీఎస్సీ కార్యదర్శి  పి. సీతారామాంజనేయులు,  క్యామ్సింగ్ మీడియా ఎండి పి. మధుసూదనరావు తదితరుల ప్రాంగణాలలో సోదాలు నిర్వహించారు. సోదాల సందర్భంగా కేసుకు సంబంధించిన కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఇతర రికార్డులను ఈడీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.  సీతారామాంజనేయులు  సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు.  

About The Author