భారతీయ అమెరికన్లను ప్రభావితం చేసిన వీసా నుంచి జాత్యహంకారం

అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేల్లో భారతీయ-అమెరికన్లు డెమొక్రాటిక్ పార్టీ వైపే మొగ్గు చూపారు. వలస విధానాలు, జాతి వివక్ష, ట్రంప్ పరిపాలన యంత్రాంగం అనుసరించిన వైఖరే ఇందుకు ప్రధాన కారణం. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, యుగోవ్‌ భాగస్వామ్యంతో అక్టోబర్ 7 నుంచి 27 మధ్య 1,000 మంది భారతీయ-అమెరికన్లపై నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది డెమొక్రాట్లకు ఓటు వేయనున్నట్టు చెప్పగా, కేవలం 19 శాతం మంది మాత్రమే రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చారు. 
 
మరో 12 శాతం మంది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. అలాగే, 46 శాతం మంది తమను డెమొక్రాట్లుగా, 19 శాతం మంది రిపబ్లికన్లుగా, 26 శాతం మంది స్వతంత్రులుగా చెప్పుకున్నారు. డెమొక్రాట్లకు ఓటేయాలనుకున్న వారిలో 35 శాతం మంది ఆ పార్టీపై ఉన్న అభిమానం కంటే రిపబ్లికన్‌లపై ఉన్న వ్యతిరేకతతోనే ఓటేస్తున్నామని చెప్పారు. మిగిలిన 65 శాతం మంది డెమొక్రాటిక్ అభ్యర్థులకు మద్దతుగా ఓటేస్తామని పేర్కొన్నారు.
 
గతంతో పోలిస్తే భారతీయ-అమెరికన్ పురుషుల్లో రిపబ్లికన్ పార్టీకి ఉన్న మద్దతు వేగంగా పడిపోయింది. 40 ఏళ్లు పైబడిన వారిలో జనవరికి 32 శాతంగా ఉన్న రిపబ్లికన్ మద్దతుదారులు, సర్వే సమయానికి 16 శాతానికి పడిపోయారు. 18 నుంచి 39 ఏళ్ల యువతలో 2024 ఎన్నికలప్పుడు డొనాల్డ్ ట్రంప్‌నకు 40 శాతం మద్దతు దక్కగా, ఇప్పుడు కేవలం 23 శాతం మంది మాత్రమే రిపబ్లికన్లను సమర్థించారు.
భారతీయ అమెరికన్ల మూడ్ మారడానికి ఇమ్మిగ్రేషన్ విధానాలే ప్రధాన కారణం. హెచ్-1బీ వీసా ఆంక్షలు, డిపోర్టేషన్లు, భారతీయ ఐటీ కంపెనీలపై తనిఖీల పట్ల భారతీయ-అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టబద్ధంగా నివసించే వృత్తి నిపుణులను, అక్రమ వలసదారులను ట్రంప్ ఒకే గాటన కట్టడం ఐటీ రంగంలో పనిచేసే వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. 
 
సర్వేలో పాల్గొన్న వారిలో 48 శాతం మంది భారతీయులను లేదా భారతీయ-అమెరికన్లను లక్ష్యంగా చేసుకుని చేసిన జాతి వివక్ష పూరిత సోషల్ మీడియా పోస్టులను చూశామని చెప్పారు. 25 శాతం మంది తాము నేరుగా జాత్యహంకార వివక్షకు గురయ్యామని తెలిపారు. సెప్టెంబర్ 2026లో యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ‘ట్రాన్స్‌ఫార్మర్స్’ క్యారెక్టర్ ఒక సిక్కు డ్రైవర్‌ను నిలదీస్తున్నట్లు ఉన్న ఫోటోను షేర్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై తీవ్ర విమర్శలు, నిరసనలు వెల్లువెత్తడంతో తొలగించింది.

అక్టోబర్‌లో చికాగో సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంపై దాడికి కుట్ర పన్నిన 19 ఏళ్ల యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. టెక్సాస్ రిపబ్లికన్ అభ్యర్థి బో ఫ్రాంచ్, ఆసియా సంతతి విద్యార్థులు ఫుట్‌బాల్ విజయాన్ని జరుపుకుంటున్న ఫోటోను షేర్ చేస్తూ స్థానికులను విదేశీయులు ఆక్రమిస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.

About The Author