ఫ్రాన్స్‌లో నిరసన జ్వాలలు ఆగడం లేదు. జీవన వ్యయం పెరుగుదల, ప్రభుత్వ సేవల్లో లోపాలు, విద్యారంగ సమస్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఫ్రాన్స్‌లో శనివారం మరో విడత నిరసనలు జరగనున్నాయి సెప్టెంబర్ చివర్లో పాఠశాలల్లో నిధుల కొరత, ఉపాధ్యాయుల సమస్యలపై విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలు క్రమంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమంగా మారాయి.
వచ్చే ఏడాది జరగనున్న ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలపైనా ప్రస్తుత పరిణామాలు ప్రభావం చూపుతున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వచ్చే ఏడాది పదవి నుంచి తప్పుకోనున్నారు. తాజా సర్వేల్లో మితవాద అభ్యర్థి మెరైన్ లీ పెన్కు మద్దతు పెరుగుతున్నట్లు రాయిటర్స్ పేర్కొంది.
అక్టోబర్ 17న జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో పలు ప్రాంతాల్లో ఘర్షణలు, దోపిడీలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం నాటి నిరసన ప్రదర్శనలకు భద్రత కల్పించేందుకు ప్రభుత్వం 70 వేల మంది పోలీసులు, భద్రతా సిబ్బందిని రంగంలోకి దించింది. ఈఫిల్ టవర్‌ను తాత్కలికంగా మూసివేశారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా కనీస వేతనాన్ని పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు విద్యారంగ సమస్యల పరిష్కారానికి 3 వేల మంది అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గించడం, వచ్చే ఏడాది ఉపాధ్యాయుల సంఖ్య పెంచడం, పాఠశాలల ఆధునికీకరణకు 4 బిలియన్ యూరోల రుణాలు అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే బడ్జెట్ లోటును నియంత్రించాల్సి ఉండటంతో జీవన వ్యయంపై నిరసనకారులు కోరుతున్న విస్తృత స్థాయి చర్యలకు ప్రభుత్వం వెనుకాడుతోంది.దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలు ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి.
అక్టోబర్‌లో వినియోగదారుల విశ్వాసం 2013 జూన్ తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయినట్లు గణాంకాల సంస్థ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు ప్రభుత్వానికి మరింత సమస్యగా మారాయి. ఫ్రాన్స్ ప్రభుత్వ రుణాలపై పెట్టుబడిదారుల్లో ఆందోళనలు పెరిగాయి. గత నెలలో పదేళ్ల ప్రభుత్వ బాండ్లపై రాబడి 5.14 శాతానికి చేరింది. 2002 తర్వాత ఇదే అత్యధిక స్థాయి.ఫ్రాన్స్‌లోనే కాకుండా యూరప్‌లోని పలు దేశాల్లోనూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జర్మనీలోని ప్రధాన నగరాల్లో విద్య, జీవన వ్యయ సమస్యలపై వేలాది మంది రోడ్డెక్కారు. ఇటలీలోనూ ప్రభుత్వ సేవల లోపాలు, పెరుగుతున్న ఖర్చులకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. స్పెయిన్, పోర్చుగల్‌లో గృహ వసతి సమస్యలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నవంబర్ 20 నుంచి 22 వరకు ఐరోపా వ్యాప్తంగా నిరసనలు నిర్వహించేందుకు కొన్ని కార్మిక సంఘాలు, గృహ హక్కుల సంఘాలు పిలుపునిచ్చాయి.

More Stories
భారతీయ అమెరికన్లను ప్రభావితం చేసిన వీసా నుంచి జాత్యహంకారం
ఇరాన్లో ట్రంప్, వాన్స్, నెతన్యాహు, విట్కాఫ్ పోస్టర్ల దహనం
లాస్ ఏంజిల్స్ మేయర్ గా కేరళ సంతతి నిత్యారామన్