బ్యాంకు రుణాల మోసం, ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించి తాజాగా సుమారు రూ.510 కోట్ల విలువైన పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన వ్యాపార సంస్థల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఇందులో రెండు చార్టర్డ్ విమానాలు, ఆరు భూములు, ఒక కార్యాలయ భవనంతో పాటు విండ్‌మిల్లులు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. ఈ తాజా చర్యతో అనిల్ అంబానీ గ్రూప్‌నకు సంబంధించిన జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.23,100 కోట్లకు చేరినట్లు ఈడీ వెల్లడించింది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్హెచ్ఎఫ్ఎల్), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్) బ్యాంకు రుణాల మోసం కేసులతో పాటు రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఆర్సీఎల్) కేసులో ఈడీ ఈ చర్యలు చేపట్టింది. మహారాష్ట్రలో రెండు చార్టర్డ్ విమానాలు, ఆరు భూములు, ఒక కార్యాలయ ప్రాంగణాన్ని అటాచ్ చేసింది. అలాగే తమిళనాడులో రెండు విండ్‌మిల్లులు, బ్యాంకు డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర పెట్టుబడులు, ఆస్తులను గుర్తించి చర్యలు తీసుకుంది.
ఆర్హెచ్ఎఫ్ఎల్, ఆర్సీఎఫ్ఎల్ బ్యాంకు రుణాల మోసం కేసులో రూ.263.05 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బ్యాంకు రుణాల మోసం కేసులో రూ.247.12 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు వెల్లడించింది. ఈ రెండు కేసుల్లో కలిపి రూ.510.17 కోట్ల ఆస్తులపై చర్యలు చేపట్టింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్లు అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ ఆరోపణలు చేసింది.
దివాలా పరిష్కార ప్రక్రియ (ఐబీసీ) చట్టాన్ని ఉపయోగించుకుని కంపెనీల ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం రక్షించుకున్నారని, దేశంలోని ప్రజాధనాన్ని విదేశీ పన్ను స్వర్గధామాలకు మళ్లించారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. నిధుల్లో గణనీయమైన భాగాన్ని ప్రమోటర్లు, వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించినట్లు ఆరోపించింది. సీబీఐ ఢిల్లీ, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం, ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన పలు కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ క్యాపిటల్ సంస్థలు ఈ విచారణ పరిధిలో ఉన్నాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆరు అభియోగపత్రాలు, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద ఒక ఫిర్యాదు దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసుల్లో ఇప్పటివరకు పది మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. రిలయన్స్ క్యాపిటల్ సంస్థకు సంబంధించి ఆగస్టులో సీబీఐ అనిల్ అంబానీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

More Stories
భారత్‌లో 1500% పెరిగిన బంగారం అక్రమ రవాణా!
ఆకాంక్షలు, దేశీయ డిమాండ్ల ద్వారా బలపడిన భారత ఆర్థిక వ్యవస్థ
సంక్షోభంలో బంగ్లాదేశ్ రెడీమేడ్ వస్త్రాలు.. రెట్టింపు జీతాలకై కార్మికులు