ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌లకు అడ్డుకట్ట వేయండి

కళాకారులను లక్ష్యంగా చేసుకుని ఏఐ దుర్వినియోగం, డీప్‌ఫేక్‌ సమస్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకొస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టాలీవుడ్ సీనియర్ నటుడు చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ కోరారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయనను సోమవారం ప్రత్యేకంగా కలిసి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌ఫేక్ టెక్నాలజీలను దుర్వినియోగం చేస్తున్న తీరును వివరించారు. 
 
 టెక్నాలజీ దుర్వినియోగం కళాకారుల హక్కులు, గౌరవం, క్రియేటివ్ కంటెంట్‌కు ముప్పుగా మారుతోందని అమిత్ షాకి చిరంజీవి వివరించారు. ఈ సమస్యను కేవలం సోషల్ మీడియా వేదికకే పరిమితం చేయకుండా, సినీ పరిశ్రమ తరఫున ఇటువంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరింత పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.  ఈ విషయంపై తక్షణమే సమీక్షిస్తామని హోమ్ మంత్రి హామీ ఇచ్చారని తెలుస్తోంది. ఏఐ దుర్వినియోగం అంశాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలిస్తుందని, మరింత పటిష్టమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.  అమిత్ షాతో భేటీ వివరాలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
 
 ”ఈరోజు మా నాన్న చిరంజీవితో కలిసి గౌరవనీయులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నాను. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగం పెరుగుతుండటంపై.. ముఖ్యంగా కళాకారులు, సినీ పరిశ్రమపై చూపిస్తున్న తీవ్ర ప్రభావం గురించి మేము వ్యక్తం చేసిన ఆందోళనలను ఆయన అర్థం చేసుకుని, సానుకూలంగా స్పందించడం ఎంతో ప్రోత్సాహాన్నిచ్చింది” అని తెలిపారు. 

”ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కలవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగం వల్ల కళాకారుల హక్కులు, గౌరవ మర్యాదలు, సృజనాత్మక కంటెంట్‌కు తీవ్రమైన ముప్పు ఏర్పడుతోందని నా ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకెళ్లాను. మేము వ్యక్తం చేసిన ఆందోళనలను ఆయన ఎంతో శ్రద్ధగా విన్నారు. ఈ సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలించి, మరింత పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి దుర్వినియోగాలకు పాల్పడేవారిపై కఠినమైన శిక్షలు విధించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు” అని చిరంజీవి తెలిపారు. 
 
ఈ అంశంపై లిఖితపూర్వకంగా వినతిపత్రం సమర్పించాలని ఆయన సూచించారని,  అలాగే ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికు అప్పగించారని ఆయన చెప్పారు. ఇది సినీ పరిశ్రమకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చే పరిణామం అని పేర్కొంటూ కళాకారులకు రక్షణ కల్పించేలా త్వరలోనే సమర్థవంతమైన చర్యలు అమల్లోకి వస్తాయని  చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. 

About The Author