దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్యలు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, అక్రమ వసూళ్ల కేసులతో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఇప్పుడు తన ప్రాణాలనే కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాడా? ఒకప్పుడు దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను విస్తరించి ప్రత్యర్థులకు సవాల్ విసిరిన ఈ గ్యాంగ్‌స్టర్‌కు ఇప్పుడు సొంత అనుచరుల నుంచే ముప్పు పొంచి ఉందా? గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్న అతడికి ప్రాణహాని ఉందని నిఘా వర్గాల నివేదికలు సమాచారంతో జైలులో భద్రత పెంచారు.
జైలులో 24 గంటల పర్యవేక్షణలో ఉన్నప్పటికీ, అతడికి శత్రువులుగా మారిన గ్యాంగ్స్టర్ల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు అతడి క్రిమినల్ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో కీలకంగా వ్యవహరించిన గోల్డీ బ్రార్, రోహిత్ గోదారా వంటి మాజీ సహచరులే ఇప్పుడు ప్రత్యర్థులుగా మారినట్లు సమాచారం. విదేశాల్లో ఉన్న ప్రత్యర్థి ముఠాలు సహితం అతని లక్ష్యంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ సందర్భంగా పది మంది ప్రత్యర్థుల పేర్లు నిఘా సంస్థల దృష్టికి వచ్చాయి.
బాంబిహా గ్యాంగ్, ఢిల్లీ, హర్యానాకు చెందిన ఇతర నేర ముఠాలు కూడా అతడి నెట్‌వర్క్‌కు సవాల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్‌కు ముప్పుగా భావిస్తున్న పది మంది గ్యాంగ్స్టర్లు, వారి మధ్య ఉన్న పాత వైరం ఆసక్తికరంగా మారింది. లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడు. దేశవ్యాప్తంగా పలు హత్యలు, బెదిరింపులు, అక్రమ వసూళ్ల కేసుల్లో అతడి పేరు ప్రస్తావనకు వచ్చింది.
అతడి నెట్వర్క్ పంజాబ్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇప్పటివరకు అతడి నుంచి ఇతరులకు ముప్పు ఉందా? అన్నదానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టేవి. కానీ తాజా నిఘా నివేదికలు మాత్రం అతడి ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉందని సూచిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు అతడితో కలిసి పనిచేసినవారే ఇప్పుడు ప్రత్యర్థులుగా మారడం ఈ పరిస్థితికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
పంజాబ్ యూనివర్సిటీ మాజీ విద్యార్థి నాయకుడు విక్కీ మిద్దుఖేరా హత్య, ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య వంటి ఘటనల తర్వాత వివిధ గ్యాంగ్‌ల మధ్య వైరం మరింత పెరిగింది. ఈ పరిణామాలు చివరకు గ్యాంగ్స్టర్ల మధ్య ప్రతీకార రాజకీయాలకు దారితీశాయి. లారెన్స్ బిష్ణోయ్‌కు ఒకప్పుడు అత్యంత నమ్మకమైన సహచరుడిగా గోల్డీ బ్రార్ గుర్తింపు పొందాడు.
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ఇద్దరి పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. బిష్ణోయ్ నెట్వర్క్ విస్తరణలో గోల్డీ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. అయితే 2025 జూన్‌లో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అప్పటి నుంచి గోల్డీ బ్రార్ బిష్ణోయ్‌కు ప్రత్యర్థిగా మారినట్లు నిఘా వర్గాల నివేదికలు సూచిస్తున్నాయి.
రాజస్థాన్‌కు చెందిన రోహిత్ గోదారా పేరు గతంలో బిష్ణోయ్, గోల్డీ బ్రార్ నెట్‌వర్క్‌తో కలిసి వినిపించింది. రాజ్‌పుత్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ హత్య కేసులోనూ అతడి పేరు ప్రస్తావనకు వచ్చింది. హర్యానాకు చెందిన కౌశల్ చౌదరి పేరు కూడా బిష్ణోయ్ ప్రత్యర్థుల జాబితాలో ఉంది. అతడికి బాంబిహా నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతాల్లో హత్యలు, బెదిరింపులు, అక్రమ వసూళ్లకు సంబంధించిన కేసుల్లో అతడి పేరు వినిపించింది.

More Stories
కక్షలోకి దూసుకుపోయిన ఎన్వీఎస్-03 ఉపగ్రహం
మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు దేశవ్యాప్తంగా గందరగోళం!
నవంబర్ 1న 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితులు నిరసన