ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. మరోవైపు భారత్, జపాన్ జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లన్నింటిలోనూ గెలిచి అజేయంగా కొనసాగుతున్నాయి. దీంతో శుక్రవారం జపాన్‌తో జరిగే పోరు మరింత కీలకంగా మారింది. మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ బంతిపై నియంత్రణ సాధిస్తూ చైనా గోల్‌పోస్ట్‌పై దాడులు చేసింది. చైనా మాత్రం రక్షణాత్మకంగా ఆడుతూ, అవకాశం దొరికినప్పుడు ఎదురుదాడులకు దిగింది.
తొలి క్వార్టర్ ముగియడానికి రెండు నిమిషాల ముందు భారత్ తొలి గోల్ సాధించింది. 13వ నిమిషంలో జగ్‌రాజ్ సింగ్ పంపిన లాంగ్ బాల్‌ను అందుకున్న సుఖ్‌జీత్.. ముందుకొచ్చిన చైనా గోల్‌కీపర్‌పై నుంచి బంతిని చాకచక్యంగా లిఫ్ట్ చేసి నెట్‌లోకి పంపించాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్‌లో చైనా ఆటతీరులో వేగం పెంచింది. భారత మిడ్‌ఫీల్డ్, డిఫెన్స్‌పై ఒత్తిడి పెంచుతూ గోల్ కోసం ప్రయత్నించింది.
26వ నిమిషంలో పెంగ్ యాంగ్ పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించడంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే చైనా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. మరుసటి నిమిషంలోనే భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ తనదైన డ్రాగ్‌ఫ్లిక్‌తో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో భారత్ 2-1 ఆధిక్యాన్ని తిరిగి సాధించింది. తొలి అర్ధభాగం ముగిసే సమయానికి భారత్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, చైనా గట్టిపోటీ ఇవ్వడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.
31వ నిమిషంలో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించగా, హర్మన్‌ప్రీత్ మరోసారి తన డ్రాగ్‌ఫ్లిక్‌తో గోల్ సాధించాడు. దీంతో భారత్ ఆధిక్యం 3-1కు పెరిగింది. 34వ నిమిషంలో సుఖ్‌జీత్ సింగ్ మరోసారి గోల్‌పోస్ట్ ముందు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అద్భుతమైన ఫినిషింగ్‌తో గోల్ సాధించాడు. దీంతో భారత్ 4-1తో పటిష్ఠ స్థితిలోకి చేరింది. 36వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను చెన్ చోంగ్‌కాంగ్ గోల్‌గా మలచడంతో చైనాకు రెండో గోల్ లభించింది. దీంతో స్కోరు 4-2కు చేరింది. ఆ తర్వాత నిలకడగా దాడులు చేసిన భారత్‌కు 47వ నిమిషంలో జగ్‌రాజ్ సింగ్ తన ప్రయత్నాన్ని గోల్‌గా మలిచి జట్టు ఆధిక్యాన్ని 5-2కు పెంచాడు. దీంతో భారత్ విజయంపై ఉత్కంఠకు తెరపడింది.

More Stories
సుప్రీంకోర్టుకు సంజయ్ రౌత్ బేషరతుగా క్షమాపణలు
నసీరుద్దీన్ షా ‘దిమాగీ నక్సల్’ వీడియోపై రిజిజు తీవ్ర విమర్శలు
న్యాయమూర్తులను కొలీజియం వ్యవస్థ కూడా ప్రభుత్వం నియమించిన్నట్లే