* రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన బీజేపీ
ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) కర్ణాటకలో సక్రమంగానే జరిగిందని చెబుతూ, ఆ విషయంపై కాంగ్రెస్ అధికారిక వైఖరికి విరుద్ధంగా మాట్లాడిన కర్ణాటక మంత్రి సతీష్ జార్కిహోళి మరోసారి భారీ వివాదాన్ని రేకెత్తించారు. పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ‘ఓట్ల దొంగతనం’ జరిగిందని మొదటగా హెచ్చరించిన రాష్ట్రం కర్ణాటకే కావడం గమనార్హం. ఓటర్ల తొలగింపు ప్రక్రియ నిబంధనల ప్రకారమే అత్యంత పారదర్శకంగా జరిగిందని పేర్కొన్నారు.
మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిన వారు, రెండుచోట్ల ఓటు ఉన్న డూప్లికేట్ ఓటర్ల పేర్లను మాత్రమే తొలగించారని, ఇది సరైన నిర్ణయమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చేపట్టిన సర్ ప్రక్రియలో ఎలాంటి గందరగోళం, అక్రమాలు జరగలేదని సతీశ్ జర్కిహోళి చెప్పారు. ఈ చర్యలవల్ల అర్హులైన ఏ ఒక్క ఓటరు హక్కుకు భంగం కలుగలేదని, బోగస్ ఓట్లను ఏరివేయడానికే ఈ ప్రక్రియ దోహదపడిందని తెలిపారు.
సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కర్ణాటకకు సంబంధించినది కాదని జర్కిహోళి స్పష్టంచేశారు. బీహార్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర వంటి ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను అమలుచేసిన తీరుపైనే తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. కర్ణాటకలో మాత్రం సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వడం, ముందస్తు సమాచారం అందించడంవల్ల సవరణ ప్రక్రియ సక్రమంగా పూర్తయిందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇంతే పద్ధతిగా పారదర్శకంగా చేసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలనే విధానం మంచిదే అయినా దాన్ని అమలుచేసే తీరు సరిగ్గా ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు ఈ మంత్రి వ్యాఖ్యలు బీజేపీకి ఆనందాన్ని కలిగించాయి. కాంగ్రెస్ నాయకులు “రాహుల్ గాంధీ ఎస్ఐఆర్ వ్యతిరేక వైఖరికి నానాటికీ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు” అని వాదిస్తూ, బీజేపీ ‘ఎక్స్’ ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్‌లో, “కాంగ్రెస్ నాయకులు కూడా స్వచ్ఛమైన ఓటర్ల జాబితా అవసరాన్ని గుర్తిస్తున్నారు. ఇది రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయాలను బట్టబయలు చేస్తోంది” అని పేర్కొంది.
కాగా, ఈ విషయంపై జర్కిహోళి వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ వైఖరికి కూడా విరుద్ధంగా ఉండటం గమనార్హం. అంతకుముందు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ, ఎస్ఐఆర్ ప్రక్రియ “పూర్తిగా ప్రజాస్వామ్య ప్రక్రియను కూకటివేళ్లతో పెకిలించి వేయడానికే” ఉద్దేశించబడిందని విమర్శించారు. “ప్రజాస్వామ్యానికి ఆధారం, పునాది ఏమిటి? ఓటర్ల జాబితానే ప్రజాస్వామ్యానికి పునాది. అత్యధిక ఓటర్లు ఉన్న కర్ణాటకలో బీజేపీకి పట్టు లేదనే కారణంతో, వారు దాదాపు కోటి ఓట్లను తొలగించారు. తమ సొంత పట్టును సృష్టించుకోవడానికి, వారు తమ స్వలాభం కోసం ఎన్నికల సంఘాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా వాడుకున్నారు. అందుకే, ఈ విషయంలోనే మేము ఎన్నికల సంఘం వైఖరిని వ్యతిరేకిస్తున్నాము,” అని ఆయన పేర్కొన్నారు.
జార్కిహోలి చేసిన వ్యాఖ్యల సమయం కాంగ్రెస్ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఆదివారం నాడు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఇది ‘ఇండియా’ కూటమికి తమ శక్తిని ప్రదర్శించే వేదికగా మారనుంది.
దీనికి ముందు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా “ప్రజల అభిశంసన” అనే కార్యక్రమం జరగనుంది. సుమారు 4 గంటల నిడివి గల ఈ కార్యక్రమాన్ని, కూటమిలోని వివిధ పార్టీల సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రసారం చేయనున్నారు. పార్టీకి చెందిన పలువురు నాయకులు జార్కిహోలి వ్యాఖ్యలను విమర్శించారు.
“జార్కిహోలి వద్ద అసలు ఎలాంటి సమాచారం ఉందో తెలియదు,” అని ప్రియాంక్ ఖర్గే చెప్పారు. “ఉదాహరణకు, చిత్తాపూర్లో ఒకే బూత్‌కు సంబంధించి, ఒకే సామాజిక వర్గానికి చెందిన 40 మందిని లక్ష్యంగా చేసుకున్నారు. దీనిపై రిటర్నింగ్ అధికారులు విచారణ జరపగా, పెద్ద సంఖ్యలో ముందే ముద్రించిన ‘ఫారమ్-7’ పత్రాలు బయటపడ్డాయి. అసలు ఇవి ఎక్కడి నుండి వచ్చాయో ఎవరికీ తెలియదు,” అని ఆయన విమర్శించారు.
“ఈ ఫారమ్-7 పత్రాలను సమర్పించిన వ్యక్తికి, తాను ఎందుకు అలా చేశానో కూడా తెలియదు. పైస్థాయి నుండి ఆదేశాలు వచ్చాయని మాత్రమే అతను చెప్పాడు. అంటే, ఇది ఒక పెద్ద కుట్ర అని, దీని మూలాలు చాలా చోట్ల విస్తరించి ఉన్నాయని స్పష్టమవుతోంది,” అని ఆయన పేర్కొన్నారు. జార్కిహోలి తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు.
సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితుడైన ఆయన, గతంలో కూడా పలు సందర్భాల్లో అవాంఛనీయ వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. కాంగ్రెస్ మంత్రులు ‘హనీ ట్రాప్’కు గురయ్యారని ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేదా ‘హిందూ’ అనే పదం ఎలా పుట్టిందనే అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు—ఇవన్నీ పెద్ద వివాదాలకు దారితీయడమే కాకుండా, బీజేపీకి అనుకూలమైన పరిస్థితులను కల్పించాయి.

More Stories
బంగ్లా వైమానిక దళ మాజీ అధికారి అనుమానాస్పద మృతి
ఇజ్రాయెల్ హంగ్ తీర్పులో కింగ్మేకర్లుగా అరబ్ పార్టీలు
హాకీ ట్రోఫీలో చైనాను చిత్తు చేసిన భారత్