పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ఆయన పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 23న విడుదలైన టీజర్ వివాదాస్పదంగా మారింది. ఈ టీజర్‌లోని ఓ సన్నివేశంపై స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేతాజీ మనవడైన చంద్ర కుమార్ బోస్ నేరుగా రంగంలోకి దిగి, దర్శకుడు హను రాఘవపూడిపై మండిపడ్డారు.
చారిత్రక వాస్తవాలను వక్రీకరించి, వారి స్థాయిని తగ్గించేలా సినిమాను మలిచారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని గౌరవించే ప్రతి ఒక్క భారతీయుడికి దర్శకుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. టీజర్లో చూపించిన ఒకే ఒక్క సన్నివేశం ఈ గొడవకు ప్రధాన కారణమైంది.
ముఖ్యంగా నేతాజీ, జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో సమావేశమైన సందర్భాన్ని సినిమాలో తప్పుగా చిత్రీకరించారనే ఆరోపణలు ఆయన చేశారు. స్వాతంత్య్ర పోరాటం, దానికి నాయకత్వం వహించిన ప్రముఖుల గురించి సినిమాలు తీయడానికి చిత్రనిర్మాతలకు స్వేచ్ఛ ఉంది కాని, సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో చారిత్రక వాస్తవాలను వక్రీకరించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ నాయకుల గురించి సినిమాలు తీసేటప్పుడు వాస్తవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రకుమార్ బోస్ వ్యాఖ్యానించారు.
1942, మే 29వ తేదీన బెర్లిన్ నగరంలో జరిగినట్లుగా ఒక సీన్ చూపించారు. ఆ సన్నివేశంలో దేశ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, జర్మనీ డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్‌తో మాట్లాడుతున్నట్లుగా ఉంది. అయితే ఆ సంభాషణలో ప్రభాస్ పోషిస్తున్న ఒక కల్పిత గూఢచారి గురించి, బ్రిటిష్ సైనికులపై అతను చేసిన పోరాటాల గురించి నేతాజీ, హిట్లర్‌తో చర్చిస్తున్నట్లు చూపించారు. ఈ సీన్ చూసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడైన చంద్ర కుమార్ బోస్ తీవ్రంగా మండిపడ్డారు. సినిమాలు తీయడానికి, కల్పిత కథలు అల్లుకోవడానికి డైరెక్టర్లకు స్వేచ్ఛ ఉందని, కానీ దేశం గర్వించదగిన గొప్ప చారిత్రక నాయకులను ఇలా కమర్షియల్ సినిమాల్లో వాడుకోవడం సరికాదని హితవు చెప్పారు. సినిమా హీరోని ఎలివేట్ చేయడం కోసం నేతాజీ స్థాయిని తగ్గించడాన్ని తాము అస్సలు ఒప్పుకోలేమని పేర్కొంటూ దీనికి దర్శకుడు హను రాఘవపూడి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
చరిత్ర ప్రకారం చూస్తే, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టడానికి నేతాజీ జర్మనీ, జపాన్ దేశాల సహాయం కోరిన మాట వాస్తవమే. కానీ ఆయన ఏనాడు హిట్లర్ భావాలను సమర్థించలేదని, ఎప్పుడూ ప్రజాస్వామ్య విలువలనే నమ్మాడని చంద్ర కుమార్ బోస్ గుర్తుచేశారు. హిట్లర్‌తో సమానంగా నిలబడి, భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని ఆయన ముందు నిలదీసిన మహా నేత నేతాజీ అని చెప్పారు.
అలాంటి గొప్ప నాయకుడిని ఒక సినిమాలోని కల్పిత సైనికుడి గొప్పతనం చెప్పడానికి వాడుకోవడం చరిత్రను తప్పుదోవ పట్టించడమేనని ఆయన వాదన. చారిత్రక నాయకుల పేర్లను ఇలా కమర్షియల్ సినిమాలలో వాడుకుని, కల్పిత కథలకు ముడిపెట్టడం కరెక్ట్ కాదని విమర్శలు చెలరేగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 19, 2027న విడుదల కానుంది.
More Stories
ఎస్ఐఆర్ పై మూడు ఆదేశాలు ఏకగ్రీవం .. సుప్రీంలో ఈసీఐ స్పష్టం
పాకిస్తాన్ లాగా భారతదేశం కూడా వంట గ్యాస్ కొరతను ఎదుర్కొంటుందా?
తుమ్మిడిహెట్టి బ్యారేజీకి మహారాష్ట్ర సానుకూలత