కాంగ్రెస్ అహంకారపూరిత వైఖరికి నిరసనగా హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రకటించారు. దేశ రాజకీయాల్లో ఎన్నికల వేళ ప్రజలను అసత్యాలతో నమ్మించలేక, నిరాశానిస్పృహలతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి తల్లి, తండ్రులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడుతున్న అనుచిత భాష, దిగజారుడు పదజాలం ఆ పార్టీ దౌర్భాగ్యకరమైన స్థితికి అద్దం పడుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ప్రజా సమస్యలను పక్కనపెట్టి సమాజంలో, దేశంలో అరాచకాన్ని సృష్టించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందని పేర్కొంటూ ఈ అరాచక వైఖరిని ఎండగట్టేందుకు ‘లోక్తంత్ర బచావో – సేవ్ డెమోక్రసీ’, ‘అరాచకత హఠావో – రిమూవ్ అనార్కీ’ నినాదాలతో నవంబర్ 2వ తేదీన బీజేపీ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా పాల్గొని నడుస్తారని ఆయన వెల్లడించారు.
ఓటర్ల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ చట్టబద్ధంగా ముగింపు దశకు చేరినా కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారాలను ఆపడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో పరాజయం ఖాయమని తేలిపోవడంతోనే ఎస్ఐఆర్ ప్రక్రియను సాకుగా చూపుతూ విమర్శలకు దిగుతున్నారని చెప్పారు.
ఎస్ఐఆర్పై ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నవంబర్ 1న ర్యాలీ పేరుతో వెళ్తామంటూ చెబుతున్న రేవంత్ రెడ్డి తీరు రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయని, 600లకు పైగా మండలాల్లో దాదాపు 330 మండలాలు వర్షాభావం, కరువుతో అల్లాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా 6 వేల చెరువులు ఉంటే కేవలం 500 చెరువుల్లో మాత్రమే నీరు నిలిచి ఉందని, రాజధాని హైదరాబాద్ నగరంలోనే రోజుకు సుమారు 8 వేల వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రజలు తాగునీటిని కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని గుర్తుచేశారు. ప్రజలు ఇంతటి నీటి సంక్షోభాన్ని, కష్టాలను ఎదుర్కొంటుంటే వాటిని పరిష్కరించడం మానేసి, బాధ్యతను గాలికి వదిలేసి రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ బాట పట్టడం క్షమించరాని నేరమని ధ్వజమెత్తారు.
అలాగే, గోదావరి ఉమ్మడి నది అని, జీఆర్ఎంబీ ఇచ్చే అవార్డును రెండు తెలుగు రాష్ట్రాలు గౌరవించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని కన్నెపల్లి (మేడిగడ్డ) బ్యారేజీ నాణ్యత లోపాలకు గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల బాధ్యతారాహిత్యమే కారణమని విమర్శించారు. ఎన్డీఎస్ఏ రిపేర్లను ఎన్నడూ అడ్డుకోలేదని చెబుతూ రైతుల ప్రయోజనాల దృష్ట్యా మరమ్మతులు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.

More Stories
జవహర్ నగర్ డంప్ యార్డ్ తరలింపు కోసం రాజీలేని పోరాటం
భాగ్యనగరంలో దుర్గామాత ఊరేగింపుపై గుడ్డు విసిరిన దుండగులు
పాలమూరు రైతాంగం గొంతు నులిమేలా డిండి లిఫ్ట్ కుట్రలు