టాటా గ్రూప్ కింద పనిచేసే టాటా ట్రస్ట్స్ దేశంలోనే అతిపెద్ద దాతృత్వ సంస్థల సమూహాల్లో ఒకటి. ఈ టాటా ట్రస్ట్స్ ఆరోగ్య రంగంలో తన సేవల్ని మరింత విస్తరించేందుకు దేశవ్యాప్తంగా 40 నుంచి 50 లాభాపేక్షలేని జనరల్ ఆస్పత్రుల నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టాటా ట్రస్ట్స్ 2025-26 వార్షిక నివేదికలో సంస్థ ఛైర్మన్ నోయల్ టాటా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులు చెల్లించగలిగే రోగుల నుంచి వచ్చే ఆదాయంతో, ఆర్థికంగా వెనుకబడిన వారికి, పేదలకు, చికిత్సకు ఖర్చు చెల్లించలేని రోగులకు చికిత్స అందించే విధానాన్ని అనుసరించనున్నారు. దీనినే క్రాస్ సబ్సిడీ మోడల్ అంటారు. అయితే ఈ కొత్త ఆస్పత్రుల కోసం ఎంత ఖర్చు చేయనున్నారు? ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి చేస్తారు? వంటి వివరాల్ని నివేదికలో వెల్లడించలేదు.
టాటా ట్రస్ట్స్ 2026-31 కాలానికి హెల్త్ కేర్ స్ట్రాటజీని రూపొందించింది. ఇందులో భాగంగా సుమారు 75 బ్లాకుల్లో 25 లక్షల మందికి ఆరోగ్య సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలానే 35 ఎంపిక చేసిన జిల్లాల్లో 100 కుపైగా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ఇతర ప్రజారోగ్య సదుపాయాలను బలోపేతం చేయాలని కూడా నిర్ణయించింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాల రేటును సంబంధిత ప్రాంతాల్లో ప్రతి 1000 జననాలకు 32 నుంచి 25 కు తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
అట్లాగే, 10 లక్షల మంది వృద్ధులకు ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడం, 20 వేల మందికిపైగా ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పించడంతో పాటు వైద్య అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయం కొనసాగించడం లక్ష్యంగా వెల్లడించింది. టాటా ట్రస్ట్స్ ఇప్పటికే క్యాన్సర్ చికిత్సను రోగుల నివాస ప్రాంతాలకు దగ్గరగా అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించి, స్థానికంగా చికిత్స పొందే అవకాశాల్ని పెంచడం ఈ విధానం లక్ష్యంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ టాటా ట్రస్ట్స్ క్యాన్సర్ కేర్ కార్యక్రమం ద్వారా 24874 కీమోథెరపీ సైకిల్స్ అందించింది. 2879 శస్త్రచికిత్సలు నిర్వహించింది. 29638 రోగులకు రేడియోథెరపీ అందించింది. 13031 మంది కొత్త రోగులకు సేవలు అందించింది.
టాటా ట్రస్ట్స్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1556.31 కోట్లను వివిధ సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు చేసింది. అయితే ఆరోగ్య సేవలతో పాటుగా దేశంలో దీర్ఘకాలం ఉపయోగపడే విద్యా, పరిశోధనా సంస్థలను నిర్మించడం కూడా టాటా ట్రస్ట్స్ లక్ష్యాల్లో భాగంగా ఉంది.

More Stories
ప్రియ గోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా, దొడ్ల పాలలో డిటర్జెంట్ అవశేషాలు
భారత్పై 100% సుంకాలు విధించే రష్యాపై ఆంక్షలను ఎత్తేసిన ట్రంప్
స్టార్లింక్తో పోటీని స్వాగతించిన జియో