ప్రియ గోల్డ్ బిస్కెట్లలో పశువుల దాణా, దొడ్ల పాలలో డిటర్జెంట్ అవశేషాలు 

* ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సోదాల్లో సంచలనాలు వెలుగులోకి 


భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన ప్రముఖ సంస్థలపై చర్యలకు దిగింది. వాటిపై చట్టపరమైన ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించామని వెల్లడించింది. అందులో సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో లిమిటెడ్ (ప్రియగోల్డ్ బిస్కెట్స్), దొడ్ల డెయిరీ, యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ ఉన్నాయి. ఒక వినియోగదారుడు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో కంపెనీ తయారీ కేంద్రంలో సోదాలు నిర్వహించారు. 
 
ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ప్రియగోల్డ్ బిస్కెట్ తయారీలో ఫైబర్ కోసం పశువుల దాణాగా ఉపయోగించే తవుడును వాడుతున్నట్టు గుర్తించారు. ప్రియాగోల్డ్‌ బిస్కెట్ల తయారీలో పశువుల దాణాకు ఉద్దేశించిన తవుడును వినియోగించారని, ఇది మానవ వినియోగానికి పనికిరాదని తేలింది. ఆయా గోనె సంచులపై ‘పశువుల దాణా’ అని రాసి ఉండడాన్ని గుర్తించారు. 
దీంతోపాటు ప్లాంట్‌లో పరిశుభ్రత లేకపోవడం, పురుగుల నివారణ చర్యలు తీసుకోవడం, ముడిసరుకుల స్టోరేజ్‌లో లోపాలను కూడా అధికారులు కనుగొన్నారు. నిబంధనలు పాటించడం లేదనే కారణంతో  సూర్య ఫుడ్‌ అండ్‌ ఆగ్రో లైసెన్స్‌ను లోగడే సస్పెండ్‌ చేసిన ఎఫ్‌ఎస్ఎస్ఏఐ, ఇప్పుడు ఆ సంస్థపై ప్రాసిక్యూషన్‌ చర్యలు ప్రారంభించింది

అధికారుల తనిఖీల్లో దొడ్ల డెయిరీకి చెందిన ‘ఫుల్ క్రీమ్ మిల్క్’ ప్రమాణాలకు విరుద్ధంగా కల్తీగా ఉన్నట్టు తేలింది. పాలను పరీక్షించగా అందులో డిటర్జెంట్ లేదా కాస్టిక్ సోడా అవశేషాలు ఉన్నట్టు గుర్తించారు. ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో, దీన్ని నాసిరకమైనదిగా ఫుడ్‌ అనలిస్ట్‌ ధ్రువీకరించారు. కంపెనీ దీనిపై అప్పీల్‌ చేయగా రిఫరల్‌ ఫుడ్‌ ల్యాబొరేటరీకి పరీక్షల కోసం పంపించారు. 
 
డిటర్జెంట్‌/కాస్టిక్‌ సోడా ఉన్నందున వినియోగానికి పనికిరావని, నిర్ణీత పరిమితి కంటే తక్కువ మిల్క్‌ ఫ్యాట్‌ను గుర్తించడంతో ప్రమాణాలకు అనుగుణంగా లేదని నివేదిక వచ్చింది. దాంతో  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సోదాల్లో  యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ బండారం కూడా బయటపడింది. 
ఈ కంపెనీ విక్రయించే పసుపు రంగు ఎండు ద్రాక్ష నమూనాలను పరీక్షించగా అందులో పురుగుమందుల అవశేషాలు బయటపడ్డాయి. 
 
నిర్ణీత పరిమితికి మించి హానికర రసాయనాల అవశేషాలు ఉండటంతో ఈ సంస్థపై కూడా చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. క్వాలిటీ, పరిశుభ్రత, నిల్వ, లైసెన్సింగ్ రూల్స్‌ను పాటించనందుకు నర్పదం ఫుడ్స్, సన్ రిడ్జెస్ హెల్త్ కేరర్స్, షా కాంతిలాల్ జయంతిలాల్ అనే మరో మూడు వ్యాపార సంస్థలకు కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు జారీ చేసింది. 
అయితే ప్రియగోల్డ్‌కు సంబంధించి ఏయే బిస్కెట్ వేరియంట్లలోనిబంధనల ఉల్లంఘన జరిగాయి అనే వివరాలను  ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  వెల్లడించ లేదు.  

About The Author